వైఎస్‌ వైద్యం.. పేదలకు వరం

13 Mar, 2019 07:11 IST|Sakshi

సాక్షి, కడప అర్బన్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. పేదలకు కూడా మెరుగైన చికిత్స అందాలనే ఆశయంతో ఆయన వైద్య వరమిచ్చారు. కడప నగర శివారులోని పుట్లంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 230 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో ‘రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)’ పేరుతో ఏర్పాటు చేశారు.  + రిమ్స్‌ను ప్రారంభంలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించాలని 2005 జనవరి 28న శంకుస్థాపన చేశారు. 
+ 2006 సెప్టెంబర్‌ 27న అప్పటి సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చేతుల మీదుగా కడప రిమ్స్‌ అధునాతన భవనాలు ప్రారంభించారు. 
+ కడప రిమ్స్‌లో 750 పడకలు, 18 విభాగాలు, ఐపీ, ఓపీతోపాటు.. కళాశాల ప్రత్యేక భవనాలతో 150 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థుల ప్రవేశార్హతతో కళాశాలను ప్రారంభించారు. 
+ సెమీ అటానమస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టి బోధనాధ్యాపకులు, పరిపాలన సిబ్బందిని నియమించారు. 
+ అదే సమయంలో నర్సింగ్‌ కళాశాల నిర్మాణం పూర్తి చేశారు. 
+ సోనియాగాంధీ పర్యటన సమయంలోనే 2006 సెప్టెంబర్‌ 27న 30 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు.
+ 2009 జనవరి 24న 100 వైద్యసీట్లతో 2008 విద్యాసంవత్సరం దంతవైద్య కళాశాలను వైఎస్‌ఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. 
+ ప్రస్తుతం 14వ వైద్య విద్యా సంవత్సరం విద్యార్థులు తమ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 
+ 2014 నుంచి పీజీ వైద్య విద్యార్థులు కూడా 9 విభాగాల్లో అభ్యసిస్తున్నారు. 
+ ప్రారంభంలో 400–450 మంది ఓపీకి రోగులు, 250 నుంచి 300 వరకు ఐపీ విభాగంలో రోగులు వైద్యసేవలను అందుకునేవారు. 
+ ప్రస్తుతం రోజూ ఓపీకి 1600 మంది నుంచి 1800 మంది వరకు, ఐపీ విభాగంలో 600 నుంచి 750 వరకు వివిధ విభాగాల్లో వైద్య సేవలు పొందుతున్నారు. 

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు 
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన వెంటనే జిల్లాకు వైద్య సేవలను అందించేందుకు రిమ్స్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయం. రోగులు దూరప్రాంతాలైన కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌కు వెళ్లకుండా.. ఆ మహానుభావుని దయవల్లే ఇక్కడే మెరుగైన వైద్యం పొందుతున్నారు. 
– కె.శ్రీనివాస్, మోచంపేట, కడప 

అన్నివర్గాల ప్రజలను రప్పించగలిగారు 
 కడప రిమ్స్‌కు పేద ప్రజల నుంచి మధ్య తరగతి వారు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఉన్నత స్థాయికి చెందిన వారు వచ్చి వైద్య సేవలు పొంది.. వారు సజావుగా ఇంటికి వెళ్లేందుకు చేసిన పుణ్యం వైఎస్‌ఆర్‌దే. ఇప్పటికీ రిమ్స్‌ ఆవరణలో ఆయన చిరునవ్వు చెరిగిపోకుండా.. ప్రతి రోగి, వారి బంధువుల రూపంలో నిలిచే ఉంటుంది. 
– ఈశ్వరమ్మ, కడప  

>
మరిన్ని వార్తలు