కట్టు కథలకు పదును!

16 Nov, 2018 04:08 IST|Sakshi
జైలు వద్ద నిందితుడి తల్లి, అన్నయ్య, బంధువు

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో సరికొత్త నాటకం

కత్తే వాడలేదు.. ప్రతిపక్ష నేతపై అసలు దాడే జరగలేదంటూ అసత్య ప్రచారం

నిందితుడు కుటుంబ సభ్యుల ద్వారా దీన్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వ పెద్దలు  

(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసులో రోజుకో అసత్యాన్ని వల్లె వేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు తాజాగా మరో అంకానికి తెరతీశారు. అసలిది హత్యాయత్నం కాదు కదా దాడి కూడా కాదంటూ సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చారు.

ఈ కేసులో హైకోర్టు క్రియాశీలంగా వ్యవహరిస్తుండంతోపాటు ఢిల్లీలోని బీసీఏఎస్‌ డీజీ ఇచ్చిన నివేదికతో కలవరపాటుకు గురై కేసును తప్పుదారి పట్టించేందుకు మార్గాలను అన్వేషిస్తూ అసలు జగన్‌పై దాడే జరగలేదన్న అసత్య ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చేందుకు తెగించారు. తమ నియంత్రణలో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు కుటుంబీకులను ఈ కట్టుకథలో పావులుగా వాడుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అదే డ్రామా...కొత్త కోణంలో
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై పక్కా పన్నాగంతో జరిగిన హత్యాయత్నాన్ని కోడి కత్తితో దాడి అంటూ హేళనగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఈ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రయత్నించారు. ఈ ఎత్తుగడ ఫలించకపోవడంతో తమ నియంత్రణలో ఉన్న నిందితుడి కుటుంబ సభ్యులను వ్యూహాత్మకంగా రప్పించి మరో అసత్య ప్రచారానికి సిద్ధమయ్యారు. నిందితుడు శ్రీనివాసరావును అతడి తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, సమీప బంధువు రామకృష్ణ ప్రసాద్‌ గురువారం విశాఖ సెంట్రల్‌ జైలులో కలిశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడిన మాటలు ప్రభుత్వ పెదల కపట నాటకాన్ని వెల్లడిస్తున్నాయి. ‘యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనలో వైఎస్‌ జగన్‌కు చిన్న గాయమై రక్తం కారింది. అంతేగానీ అసలు కత్తినే వాడలేదు’ అని ములాఖత్‌ సందర్భంగా శ్రీనివాస్‌ తమకు చెప్పినట్లు వారు పేర్కొనటం విస్మయపరుస్తోంది. మరి శ్రీనివాస్‌ ఇంకేదైనా ఆయుధం వాడాడా? అని మీడియా ప్రశ్నించగా వారు సమాధానం దాటవేశారు.

హత్యాయత్నం అనంతరం నిందితుడు వినియోగించిన పదునైన కత్తిని సైతం ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా, ప్రభుత్వ పెద్దలే పక్కా వ్యూహంతో శ్రీనివాస్‌ కుటుంబీకులను తాజాగా జైలుకు రప్పించి వారితో ఈ మాటలు పలికించినట్లు స్పష్టమవుతోంది. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గతంలో చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా తాజాగా మాట్లాడటం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.

కుటుంబం పరువు తీశావని నాడు మందలింపు
గతంలో ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులను ఓసారి విశాఖకు రప్పించారు. ఆ సందర్భంగా వారు శ్రీనివాసరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కుటుంబం పరువు తీశావు. ఎందుకీ పని చేశావు? ఇప్పటికైనా నిజం చెప్పు’ అని కొడుకును తీవ్రంగా మందలించారు. తమ బిడ్డ ఎందుకు ఈ హత్యాయత్నం చేశాడో తెలియడం లేదని అనంతరం పోలీసుల వద్ద వాపోయారు. శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఠాణేలంకలో అతడి సోదరి రత్నకుమారి విలేకరులతో మాట్లాడుతూ ‘మా తమ్ముడు శ్రీనివాసరావు వద్ద డబ్బులుండేవి కావు.

ఈ హత్యాయత్నం వాడికి పుట్టిన బుద్ధి కాదు. ఎవరో డబ్బు ఆశ చూపించి వాడితో ఈ పని చేయించారు’ అని వాస్తవాన్ని కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పారు. దీనికి పూర్తి విరుద్ధంగా శ్రీనివాసరావు తల్లి, సోదరుడు, సమీప బంధువు తాజాగా విశాఖ సెంట్రల్‌ జైలు వద్ద మాట్లాడటం గమనార్హం. నిందితుడిని జైలుకు తరలించాక అతడి కుటుంబ సభ్యులు ఎవరూ ములాఖత్‌కు రాలేదు. నిందితుడిని ఎవరూ కలవకుండా టీడీపీ పెద్దలే కట్టడి చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలే వ్యూహాత్మకంగా శ్రీనివాసరావు కుటుంబీకులను మరోసారి తెరపైకి తెచ్చారని సమాచారం.

పెద్దల ఆదేశాలతోనే ములాఖత్‌కు!
ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ, సీఎం చేసిన వ్యాఖ్యలతో ఈ కేసును రాష్ట్ర పోలీసులు పారదర్శకంగా విచారించే అవకాశమే లేదన్న విషయం తేలిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారించాలని కోరుతూ వైఎస్‌ జగన్, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు ప్రభుత్వ, పోలీసుల లోపాలను ప్రశ్నించింది. విమానాశ్రయంలో మూడు నెలలుగా సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదని నిలదీస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఎంపీ వి.విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో ఢిల్లీలోని బీసీఏఎస్‌ డీజీ కుమార్‌ రాజేష్‌చంద్ర కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు గానీ, ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని అయిన టీడీపీ నేత  హర్షవర్థన్‌గానీ విమానాశ్రయంలో ప్రవేశించేందుకు అవసరమైన ఏరోడ్రోమ్‌ ఏంట్రీ పర్మిట్‌ కోసం దరఖాస్తు కూడా చేయలేదని తెలిపారు. దీంతో ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. ఈ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే తమ కుట్ర బయటపడుతుందని ఆందోళన చెందారు. దీంతో అసత్య  ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పక్కా స్క్రిప్ట్‌ రచించారు. అందుకు శ్రీనివాసరావు కుటుంబీకులను పావులుగా వాడుకుంటూ దిగజారుడు రాజకీయాలకు తెగించారు.


శ్రీనివాసరావు బెయిల్‌పై నేడు నిర్ణయం
విశాఖ లీగల్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది.  అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జయలక్ష్మి తన వాదనలను మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. మరికొంత మందిని విచారించాల్సిన అవసరముందని.. అలాగే హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున బెయిల్‌ మంజూరు చేయడం సరైంది కాదని వివరించారు. అనంతరం న్యాయమూర్తి తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు