సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా నేడు మహిళా పోరు

21 Oct, 2013 00:07 IST|Sakshi

 

=నియోజకవర్గ కేంద్రాల్లో మానవహారాలు
 =వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమైక్యపోరు

 
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం మహిళా మానవహారం కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల రెండో తేదీ గాంధీ జయంతి నుంచి నవంబర్ ఒకటి ఆంధ్ర అవతరణ దినోత్సవం వరకు నిరసన కార్యక్రమాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేశారు. ఆ మేరకు పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళా మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉదయభాను కార్యకర్తలను కోరారు.
 
ఎడతెగని పోరు...

ఇప్పటివరకు పార్టీ చేపట్టిన సమైక్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల రెండో తేదీ నుంచి అసెంబ్లీ సమన్వయకర్తలు నిరవధిక నిరాహారదీక్షలు చేశారు. వాటిని ప్రభుత్వం భగ్నం చేశాక రిలేదీక్షలు జరిగాయి. ఏడో తేదీన మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని వారి నివాసాల ఎదుట శాంతియుత ధర్నాలు చేశారు. పదిన అన్ని మండల కేంద్రాల్లో రైతులతో దీక్షలు చేపట్టారు. 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటో, రిక్షాలతో ర్యాలీలు నిర్వహించారు.

అనేకచోట్ల పార్టీ నేతలు స్వయంగా ఆటోలు, రిక్షాలు నడిపి నిరసన తెలిపారు. ఇక 24న అన్ని కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. దాంతోపాటు హైదరాబాద్‌లో 26న పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు కార్యకర్తలు, సమైక్యవాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  సమైక్య శంఖారావానికి తరలిరావాల్సిందిగా కోరుతూ విస్తృత ప్రచారం చేస్తున్నామని కన్వీనర్ సామినేని ఉదయభాను వివరించారు.
 

మరిన్ని వార్తలు