బాబు ప్యాకేజీ బాగుంది! బీజేపీ మాట తప్పింది!

7 Mar, 2015 03:38 IST|Sakshi
బాబు ప్యాకేజీ బాగుంది! బీజేపీ మాట తప్పింది!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింగపూర్ తరహా రాజధాని ఏ మేరకు అవసరమో పాలకులు పునస్సమీక్షించుకోవాలంటూ రాజధాని ప్రతిపాదిత గ్రామాల పర్యటనలో వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హైదరాబాద్ రాగానే ‘చంద్రబాబు రైతులకిచ్చిన ప్యాకేజీ చాలా బాగుంద’ని కితాబిచ్చారు. సాధారణ ఎన్నికల తరువాత రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు శుక్రవారమిక్కడ తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా, రైతు రుణాల మాఫీ హామీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నిజాయితీగా ఉన్నారని, అయితే అందుకు నిధులు సరిపోయినన్ని లేవని పవన్ బాధపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో మాత్రం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామన్న ‘మాట తప్పింది’ అని ఆయన విమర్శలు గుప్పించారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపే విషయంలో అధికారంలోకి రాగానే ఆర్డినెన్స్ జారీచేసిన బీజేపీ ప్రభుత్వం అంతే తొందరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ముందుకు రావట్లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు ఏవో సమస్యలు చెబుతున్నారని, హామీ ఇచ్చిన సమయంలో సమస్యలు వస్తాయని తెలియదా? అని ప్రశ్నించారు.  

2019లోబాబు అధికారంలోకి రాకపోతే..
తానైతే చంద్రబాబే 2020 తరువాత కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని, ఒకవేళ 2019లో టీడీపీ అధికారంలోకి రానిపక్షంలో రాజధానికి భూములిచ్చిన రైతులకు రాజ్యాంగపరంగా ఎలాంటి భద్రత ఉంటుందో చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేయాలని పవన్ అన్నారు. తుళ్లూరు మండలంలో పలు గ్రామాలకు చెందిన అనేకమంది రైతులు తనకు ఫోన్లు చేసి.. ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారన్నారు. ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి తాము అధికారంలోకొస్తే మీ భూములు వెనక్కి ఇస్తామంటూ  రైతులకిచ్చిన హామీని పవన్ ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలు మారినా స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు రాజ్యాంగపరంగా ఉండే భద్రత ఏమిటని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగితే ఆమరణ దీక్ష చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నారా? అన్న ప్రశ్నకు చేతులు అడ్డంగా ఊపుతూ సమాధానం దాటవేశారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలదే బాధ్యతని పవన్‌కల్యాణ్ అన్నారు. తాను నిరసన వ్యక్తం చేయడం తప్ప గట్టిగా మాట్లాడడానికి ఎంపీని కాదు కదా అని పేర్కొన్నారు.
 
తెలంగాణ ఉప ఎన్నికల్లో నేనే పోటీ చేయొచ్చు
తెలంగాణ ప్రాంతంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో స్వయంగా తానే పోటీ చేసే అవకాశం ఉందని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అంశంపై ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదని.. అయితే కొందరు మంత్రులు పార్టీలు మారిన దృష్ట్యా ఈ లోగానే తెలంగాణలో జరిగే ఏ ఎన్నికలోనైనా జనసేన పార్టీ తప్పక పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. మీరే ఆ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ‘అవకాశముంది’ అని పవన్ బదులిచ్చారు.
 
అక్కడొక మాట.. ఇక్కడొక మాట..
ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడి రైతులకు అండగా ఉంటానని చెప్పిన మాటలను హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మార్చేశారు. ఆయన అందుకున్న కొత్త పల్లవి ఇలా...
 
రైతులతో పవన్: రాజధానికోసం భూములు ఇవ్వలేమన్న రైతులను వదిలివేయడం మంచిది. ప్రభుత్వం మొండిగా సమీకరణకు దిగితే ఊరుకోను. బాధిత రైతులపక్షాన పోరాటం చేస్తా.
హైదరాబాద్‌లో: రాజధాని భూ సమీకరణకోసం రైతులకిచ్చిన ప్యాకేజీ చాలా బాగుంది.
రైతులతో పవన్: 33 వేల ఎకరాల్లో సింగపూర్ తరహా రాజధాని ఏ మేరకు అవసరమో పాలకులు పునస్సమీక్షించుకోవాలి. భూసేకరణ పేరిట ప్రభుత్వం బెదిరిస్తే ఎవరూ భయపడవద్దు.
హైదరాబాద్‌లో: రాజధానికి ఎన్నివేల ఎకరాలు ఉండాలనే దాని జోలికి నేను పోవడం లేదు. అయితే మొత్తం భూములన్నింటిలో రైతులను పంటలు వేసుకోవద్దని చెప్పడం కాకుండా పనులు జరిగే దానినిబట్టి దశలవారీగా పంటలు వేసుకోవాలని చెప్పడం మంచిది.
రైతులతో పవన్:భూములివ్వడం ఇష్టంలేని రైతులెవ్వరూ భయపడొద్దు. ప్రభుత్వం భూసేకరణకు వస్తే ఆమరణదీక్ష చేస్తా. ఐదారు వేల ఎకరాలతో చక్కని రాజధాని కట్టుకోవాల్సిందిపోయి 33 వేల ఎకరాలతో సింగపూర్ తరహా రాజధాని ఎందుకు?
హైదరాబాద్‌లో: రైతులకు అన్యాయం జరిగితే ఆమరణ దీక్ష చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నారా? అని హైదరాబాద్‌లో అడగ్గా చేతులు అడ్డంగా ఊపుతూ సమాధానం దాటవేత.
రైతులతో పవన్: త్వరలోనే ఢిల్లీ వెళ్తా. తెలుగు జాతికిచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని కేంద్రప్రభుత్వ పెద్దలకు చెబుతా. యూపీఏలాగా ఎన్డీఏ సర్కారు కూడా మాటతప్పితే ఏం చేయాలో తర్వాత చెబుతా
హైదరాబాద్‌లో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలదే బాధ్యత. విలేకరుల సమావేశం పెట్టో, ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయడం తప్ప గట్టిగా మాట్లాడడానికి నేను పార్లమెంట్ సభ్యుడిని కాదు కదా.
రైతులతో పవన్: 50 చదరపు మైళ్ల విస్తీర్ణంలో రాజధాని అవసరమా అని సర్కారు ఆలోచించాలి
హైదరాబాద్‌లో: రాజధానికోసం ఇప్పటికే 95 శాతం భూముల రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకొచ్చినందున వారి విషయం నేను మాట్లాడడం లేదు.

మరిన్ని వార్తలు