మహిళా మేలుకో.. రక్షణ చట్టాలు తెలుసుకో

22 Aug, 2019 09:48 IST|Sakshi

అకృత్యాల అడ్డుకట్టకు ఎన్నో చట్టాలు  

ప్రతి మగువకు చట్టాలపై అవగాహన అవసరం

సాక్షి, అమరావతి :  జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసి.. అదనపు కట్నం కోసం వేధించే భర్త. కార్యాలయాల్లో ఇబ్బందులు.. కాలేజీలో ప్రేమ పేరిట విసిగించే జులాయిలు.. ఇలా అడుగుకో మగాడు మహిళలపై రకరకాల వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నో చట్టాలు, మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి మహిళల్లో చైతన్యం లేకపోవడమే వారి పాలిట శాపంగా మారింది. వారికి ఉపయోగపడే చట్టాలపై మహిళలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

గృహహింస రక్షణచట్టం..  
మహిళను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హింసించడం వంటివి గృహ హింస చట్టం కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది భార్యాభర్తలు మాత్రమే కానవసరం లేదు. పుట్టుక ద్వారా, పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసి ఉంటున్న వారైనా ఒకే ఇంట్లో ఉంటూ, గతంలో కలసి నివసించిన స్త్రీ, పురుషులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. బాధితురాలి తరఫున ఎవరైనా రక్షణ అధికారికి ఫిర్యాదు  చేయవచ్చు. రక్షణ అధికారి జరిపిన విచారణను నివేదిక రూపంలో మేజిస్ట్రేట్‌ కోర్టుకు అందించాలి. 

వరకట్న నిషేధ చట్టం 
కట్నం ఇవ్వడాన్ని, తీసుకోవడాన్ని నిషేధించారు. చట్ట ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం, కట్నం తీసుకోవడంలో దోహదపడడాన్ని కూడా శిక్షార్హులుగా పరిగణిస్తారు. ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, రూ.15 వేల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంది. సెక్షన్‌–4 కింద ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ  కట్నం అడిగితే శిక్షాకాలం ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు, రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. సెక్షన్‌–5 ప్రకారం కట్నం ఇచ్చి పుచ్చుకోవడానికి ఏమైనా  ఒప్పందాలు చేసుకుంటే అవి చెల్లవు. సెక్షన్‌–7 ప్రకారం నేరం జరిగిన ఏడాదిలోపు గుర్తించినా, వారిపై చర్యలు తీసుకోవచ్చు. సెక్షన్‌–8 (ఏ) ప్రకారం వరకట్న నిషేధ చట్టం అమలుకు ప్రభుత్వం అధికారులను నియమించాలి.

నిర్భయ చట్టం
మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. మహిళలపై జరుగుతున్న దాడులు లైంగిక దాడులు, వేధింపులు, కిడ్నాప్, హింస ఈ చట్టం కిందకు వస్తాయి. 

నిర్బంధ వివాహ నమోదు చట్టం–2002 
రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం కూడా కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ చట్టం కింద వివాహ నమోదు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు. 

వ్యభిచార నిరోధక చట్టం : మహిళలను వ్యభిచార కూపంలోకి లాగకుండా చట్టం  రక్షణ కల్పిస్తుంది.  

మహిళలపై అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం
యాక్ట్‌ 1986 ప్రకారం మహిళలను కించపరిచే విధంగా బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు తదితరాలు ఈ చట్టం ద్వారా నిరోధించారు. 

సతీ నిరోధక చట్టం  
భర్త మరణిస్తే అతని భౌతికకాయంతో పాటు భార్యను బలవంతంగా చితిపై దహనం చేసే అనాగరిక చర్య నుంచి మహిళలకు ఈ  చట్టం రక్షణ కల్పిస్తుంది. 

సెక్షన్‌ –100
ఆత్మ రక్షణ కోసం ఒక వ్యక్తిపై దాడి చేస్తే తప్పులేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా వారికి శిక్షపడదు. 

వివాహ రద్దు చట్టం..
తన వివాహాన్ని రద్దు చేసుకునే హక్కును ముస్లిం మహిళలకు ఈ చట్టం ద్వారా కల్పించారు.   

విడాకులు పొందిన ముస్లిం మహిళల రక్షణ చట్టం
భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ఈ చట్టం చేశారు. 

కుటుంబ న్యాయస్థానాల చట్టం
కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఈ చట్టం కింద ఏర్పాటు చేశారు. 

హిందూ పౌరసత్వ చట్టం
ఈ చట్టాన్ని 2005లో సవరించారు. ఈ చట్ట ప్రకారం మహిళలకు తన తండ్రి ఆస్తిలో  పురుషుడితో సమాన హక్కు ఉంది. 

మాతృత్వ ప్రయోజనాల చట్టం 
పనిచేసే మహిళలకు ప్రసూతి ముందు, ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్ధేశిస్తుంది. 

లీగల్‌ సర్వీస్‌ అథారిటీ చట్టం
ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తుంది.

బాల్య వివాహ నిరోధక చట్టం 
ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించారు. మగ పిల్లలకు 21 ఏళ్లలోపు, ఆడ పిల్లలకు 18 ఏళ్లలోపు జరిగే ఏ వివాహమైన బాల్య వివాహమే. 21 ఏళ్లు దాటిన యువకుడు చిన్న వయస్సులోని ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటే అతడికి రెండేళ్ల జైలు శిక్ష లేదా, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ చట్టం పరిధిలో కేసులను విచారించవచ్చు. బాల్య వివాహాన్ని ఎవరైనా జరిపిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే ఆ వివాహాన్ని నిరోధిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసే  అధికారం న్యాయాధికారికి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఎవరి దృష్టికి రాకుండా బాల్య వివాహం జరిగితే ఆ వివాహాన్ని ఈ చట్టంతో రద్దు చేసుకోవచ్చు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే బాలల సహాయ హెల్ప్‌లైన్‌కి తెలియజేయవచ్చు. 

లింగ ఎంపిక నిషేధ చట్టం
ఈ చట్టం ప్రకారం స్త్రీల పట్ల వివక్షత నివారించడానికి లింగ ఎంపిక, భ్రూణహత్యలను నిషేధించారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే పరిస్థితుల్లో జన్యుసంబంధిత వ్యాధులకు మాత్రమే తల్లి అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకునే అవకాశం ఉంది. స్కాన్‌ సెంటర్లు, డాక్టర్లు వీటి వినియోగంపై ప్రభుత్వం అజమాయిషీ, నియంత్రణను జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌కు కల్పించింది. అక్రమంగా స్కాన్‌ చేసి లింగ నిర్ధారణ వెల్లడి చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణించి కఠినమైన చర్యలు విధిస్తారు. 

సమాన వేతన చట్టం 
స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ విక్ష ఆధారంగా స్త్రీలకు వేతనాలు తగ్గించరాదు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు