మంత్రి సోమిరెడ్డిపై న్యాయవాదుల ఫిర్యాదు

19 Sep, 2018 11:01 IST|Sakshi

కోర్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహణపై అభ్యంతరం

జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన న్యాయవాదులు

ఫ్యాక్స్‌ ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు పంపిన వైనం

నెల్లూరు లీగల్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యంగ వ్యవస్థ అయిన కోర్టు ప్రాంగణంలో పత్రికా సమావేశం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విమర్శలు చేయటానికి కోర్టు ప్రాంగణాన్ని అనుమతి లేకుండా వినియోగించటం నిబంధనలకు పూర్తి విరుద్ధం అని పేర్కొంటూ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబుకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

 అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ బి.శివశంకరరావుకు ఫ్యాక్స్‌ ద్వారా ఫిర్యాదును పంపారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కోర్టు నియమ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. ఈ నెల 15న మంత్రి సోమిరెడ్డి కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన అనంతరం మంత్రి సోమిరెడ్డి కోర్టు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అది కూడా పూర్తిగా వ్యక్తిగత రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపైనే మాట్లాడారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో రాజకీయపరమైన కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

 కోర్టు ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించేలా వ్యవహరించటంతోపాటు కోర్టు విలువలను, నిబంధనలను పాటిం చకుండా ఉండటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించటం అధికార దుర్వినియోగం అవుతుందని, దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ప్రాంగణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్త పద్ధతికి తెరతీసి పవిత్ర న్యాయస్థానాలను అగౌరవ పరిచేలా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీతో పాటు విలేకరుల సమావేశానికి సంబం« దించిన వీడియోలు, ఫొటోలను అందజేశారు. బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కుడుముల రవికుమార్, మురళీధర్‌రెడ్డి, పత్తి రాజేష్‌తో పాటు పలువురు న్యాయవాదులు ఉన్నారు.   

>
మరిన్ని వార్తలు