పగోడికీ..ఈ కష్టం వద్దు!

28 May, 2018 12:28 IST|Sakshi
ఇద్దరు కుమార్తెలతో లక్ష్మణ్‌

నైజాం వెళ్లి ప్రమాదానికి గురైన బేల్దారి మేస్త్రి

భవనం నుంచి పడి విరిగిన వెన్ను, కాళ్లు

ఆరేళ్లుగా అన్ని మంచంపైనే.. పుట్టింటికి వెళ్లిన భార్య

అన్నీ తామైన కుమార్తెలు..తండ్రి కోసం చదువుకు స్వస్తి

ఆర్థిక సాయం కోసం వినతి

కుటుంబ పోషణ కోసం పొట్ట చేతబట్టుకుని నైజాం వెళ్లింది ఆ కుటుంబం. ఇంటి యజమాని బేల్దారి పని చేసుకుంటూ భార్య, పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. ఇంతలో విధి ఆ కుటుంబంపై పగ బట్టింది. బేల్దారి పని చేసే సమయంలో నాలుగో అంతస్తు నుంచి పరంజా విరిగి కింద పడిపోయాడు. ఫలితంగా వెన్ను, రెండు కాళ్లూ విరిగి ఇప్పుడు మంచానికి పరిమితమయ్యాడు. ఆరేళ్లుగా మంచం పట్టడంతో అండగా ఉండాల్సిన భార్య..భర్తను వదిలి పుట్టింటికి చేరింది. చివరకు ఇద్దరు కుమార్తెలు చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి తండ్రికి బాసటగా నిలిచారు. పగోడికీ మా కష్టం వద్దని దేవుడిని వేడుకుంటున్నారు.

గార్లపేట (మర్రిపూడి):  గార్లపేట గ్రామానికి చెందిన బింగినపల్లి లక్ష్మణ్‌ చిన్ననాటి నుండి బేల్దారి పనికి వెళ్తుంటాడు. అతడికి దర్శి పట్టణానికి చెందిన కోటమ్మతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. దూదేకుల సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌కు ఎలాంటి భూమి లేదు. చిన్న తనంలోనే తండ్రి పెద సిద్ధయ్యను పోగొట్టుకున్నాడు. తల్లి సుభానమ్మ వద్ద ఉంటూ హైదరాబాద్‌ వెళ్లి బేల్దారి పని నేర్చుకున్నాడు. వివాహం అనంతరం భార్య, బిడ్డలతో పొట్ట చేతబట్టుకుని బేల్దారి పని కోసం నైజాం వెళ్లాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌ బండ మైసమ్మ వద్ద పని కుదుర్చుకున్న లక్ష్మణ్‌ నాలుగో అంతస్తులో తాపీ పని చేస్తున్నాడు. పని చేస్తుండగా పరంజా విరిగి అమాంతం కింద పడ్డాడు.

ఇక్కడి నుంచే కష్టాలు
ప్రమాదంలో లక్ష్మణ్‌ వెన్నుపూస, రెండు కాళ్లు విరిగిపోయాయి. లక్ష్మణ్‌ను తీసుకెళ్లిన మేస్త్రి మస్తాన్‌ వైద్యానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. పనిచేయించుకున్న ఇంటి యజమాని మరో రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేదు. లక్ష్మణ్‌ నడవలేక ఆరేళ్లు మంచంలోనే పడి ఉన్నాడు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కుటుంబ పోషణ భారం కావడంతో తన ఇద్దరి పిల్లలు, భర్తను వదిలేసి భార్య కోటమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ భారం పెద్ద కుమార్తె మహేశ్వరిపై పడింది. రోజూ కూలికి వెళ్లి తండ్రిని పోషించుకుంటోంది. చిన్న కుమార్తె హైమా తండ్రి వద్దే ఉంటూ అన్నం పెట్టడం, మూత్రం పైపు మార్చడం, శరీరం తుడవడం వంటి సపర్యలు చేస్తోంది. బాల్యంలో చదువుకోవాల్సిన ఆ చిన్నారులపై మోయలేని భారం పడింది. ఆరో తరగతిలో చదువు ఆపేసి తండ్రికి సాయంగా మంచి చెడులు చూసుకుంటోంది. కుటుంబ భారాన్ని మోయాల్సిన తండ్రి లేవలేని స్థితిలో మంచం పట్టడం ఆ చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రిని చూసుకుని కుమార్తెలు మౌనంగా రోదించని రోజు లేదు.

ఆపన్న హస్తం కోసం
తండ్రి వైద్యానికి ప్రతి నెలా రూ.4 వేలు ఖర్చు కావడంతో కుటుంబ భారాన్ని మేయలేకపోతున్నామని కుమార్తెలు మహేశ్వరి, హైమా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కనిగిరి వెళ్లి మల్లికార్జున వైద్యాశాలలో చికిత్స చేయించుకుంటున్నామని చెబుతున్నారు. ఇక ఆర్థిక స్థోమత లేదని, వైద్యం చేయించలేక పోతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆసర కల్పించకపోవడంతో దాతల సాయంతో గార్లపేటలో ఓ రేకుల ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తమ తండ్రి వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయదలచిన వారు 96660 15375, 98494 25458 నంబర్లకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు

మరిన్ని వార్తలు