లక్ష్మీబాంబు అంటే బాబుకు భయం

31 Mar, 2019 10:56 IST|Sakshi
నందమూరి లక్ష్మీపార్వతి

సాక్షి, రాయవరం (మండపేట): ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీకి భయపడనని, కేసీఆర్‌కు భయపడనని, బాంబులు వేసినా భయపడనని చెబుతున్నారు. కాని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే బాంబుకి మాత్రం భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. రాయవరం మండలంలో ప్రచారం చేసేందుకు పసలపూడి వచ్చిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబునాయుడిలోని అసలు సిసలైన కోణాన్ని దర్శకుడు రామ్‌గోపాలవర్మ చూపించారన్నారు. అందుకే తన నిజస్వరూపం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ద్వారా బట్టబయలవుతుందనే భయంతో సినిమాను ఆపించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను విడుదల చేయాలన్నారు. చంద్రబాబునాయుడే ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యేలతో చెప్పులేయించి, ఆత్మక్షోభకు గురి చేశారన్నారు. చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనేందుకు చంద్రబాబు చూస్తున్నాడన్నారు. 


మడమ తిప్పని నేత జగన్‌
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిగా లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తన కొడుకు వయస్సున్న జగన్‌మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అతడే సైన్యమన్నట్లుగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తుంటే, చంద్రబాబునాయుడు ఇతర రాష్ట్రాల నాయకులను దిగుమతి చేసుకుని ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. నీతి, నిజాయితీ ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. విలేకరుల సమావేశంలో సినీ నిర్మాత తాడి గనిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండపేట నియోజకవర్గ అధ్యక్షుడు చిర్ల జయరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు