ఆలయం పరువుకు గ్రహణం

28 Jul, 2018 13:14 IST|Sakshi
సత్యదేవుని ఆలయం.. , సూపరింటెండెంట్‌పై గర్భగుడిలో అర్చకుల దాడి

సత్యదేవుని సన్నిధిలోనే దిగ్భ్రాంతికర సంఘటనలు

పౌర్ణమి పూజల వేళ అవాంఛనీయ పరిణామాలు

ఆలయం సూపరింటెండెంట్‌పై అర్చకుల దాడి

అనధికారిక పూజారిని అడ్డు తొలగమన్నందుకు ఫలితం

దేవుని చెంత అపచారం..  సిబ్బంది ఆగ్రహం

విశాఖపట్నం డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ: పవిత్రమైన, ప్రముఖమైన ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. దైవ సన్నిధిలోనే ఆలయం పరువుకు గ్రహణం వాటిల్లింది. ఇసుక కొండపై వెలసిన రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో మూలవిరాట్టు సన్నిధిలోనే క్షోభ కలిగించే సంఘటన జరిగింది. ఆషాడ పౌర్ణమి రోజున.. ఉదయ సమయంలో పూజలు జరుగుతూ ఉండగా.. ఆలయ ప్రధానార్చకుడు సూపరింటెండెంట్‌పై గర్భగుడిలోనే దాడి చేయడంతో కలవరం చోటు చేసుకుంది. భక్తులంతా నివ్వెరపోయి చూస్తూ ఉండగానే ఈ ఉదంతం జరిగింది. భక్తులకు, భగవానుడికి మధ్య వారధిగా ఉండే అర్చకుడు ఇలా హేయంగా ప్రవర్తించారని దేవాలయాల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురు పూర్ణిమ పురస్కరించుకొని శుక్రవారం ఉదయం భక్తులు సత్యనారాయణస్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. భక్తుల, ఆలయం ఈవో శైలజ కథనం ప్రకారం.. ప్రధానార్చకుడు అనధికారికంగా ఓ పూజారిని తీసుకువచ్చి గర్భగుడి వద్దనియోగించారు. ఆయన కారణంగా గర్భగుడిలో స్వామి విగ్రహం కనిపించకుండా ఉందని భక్తులు అనడంతో సూపరింటెండెంట్‌ సురేష్‌ ఆయనను పక్కకు జరగమని ఆలయ సూపరింటెండెంట్‌ సురేష్‌ కోరారు. దీంతో ప్రధానార్చకుడు ఫణిహార నరసింహమూర్తికి కోపం కట్టలు తెంచుకుంది. సూపరింటెండెంట్‌పై మండిపడడమే కాక, దేవుని చెంత, భక్తులు చూస్తుండగా అతడి చెంప ఛెళ్లుమనిపించారు. ఎడాపెడా కొడుతూ విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న ఆయన కుమారుడు కూడా ఓచెయ్యి వేశారు. సురేష్‌పైనే గాక అల్లిపురం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి డి ప్యూటేషన్‌పై వెళ్లిన రవిపై కూడా ఇద్దరూ దాడికి దిగారు.  ఇదంతా సీసీ కెమారాల్లో రికార్డయింది. ఈ సంఘటనలతో భ క్తులు నివ్వెరపోయారు. వెంటనే ఆలయ ఈవో కె.శిరీష అక్కడకు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పారు.

దక్షిణలు కూడా వారికే..
ప్రధానార్చకుడు నరసింహమూర్తి సుమారుగా రూ. 50వేల వేతనం అందుకుంటున్నారు. ఆయన కుమారుడు ఆరేళ్ల కిందట అర్చకుడిగా నియమితులయ్యారు. ఆయనకూ పీఆర్‌సీ ప్రకారం వేతనం వస్తోంది. ఇదికాక పళ్లెం రాబడిని కూడా వారే తీసుకుంటున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రూ. 5 లక్షల పైబడి రాబడి ఉన్న ఆలయాల్లో పీఆర్‌సీ ప్రకారం వేతనాలు తీసుకుంటున్న అర్చకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పళ్లెంలో నగదు తీసుకోకూడదని సిబ్బంది వాదిస్తున్నారు. దీనిపై విభేదాలు ఉండవచ్చని, అర్చకుడి దాడికి అది కారణం కావచ్చని అభిప్రాయం వినవస్తోంది.

దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆగ్రహం
పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తించే అర్చకులు ఇలా దాడులు చేయడంపై వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది మండిపడతున్నారు. సిబ్బందితో సమన్వయంగా మెలిగి, ఆలయం పట్ల భక్తుల్లో గౌరవప్రపత్తులు పెంచాల్సినవారు ఇలా దాడి చేస్తే దేవాలయం పరువుప్రతిష్టలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. దాడులకు దిగిన పూజారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ముగిసిన విచారణ
ఆలయంలో జరిగిన సంఘటనలపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ మూర్తి విచారణ నిర్వహించారని ఈవో శైలజ తెలిపారు. ఆయన నివేదికను కమిషనర్‌ కార్యాలయానికి పంపినట్టు తెలియజేశారు. మరోవైపున అర్చకుల తీరును నిరసిస్తూ ఆలయంలో సిబ్బంది శనివారం నుంచి విధులకు గైర్హాజరవుతున్నట్టు నోటీసు ఇచ్చారని ఆమె చెప్పారు. అర్చకులపై చర్యలు తీసుకునేటంత వరకు విధులకు హాజరు కాబోమని తెలిపారన్నారు.

అనుమతి లేకుండానే..
ప్రతి పౌర్ణమికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో ప్రధానార్చకుడితోపాటు ఆయన కుమారుడు కూడా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ పౌర్ణమికి వారిద్దరే కాకుండా నా అనుమతి లేకుండా ఓ అర్చకుడిని తెచ్చి గర్భగుడిలో నియోగిస్తున్నారు. ఈ విషయం నా దృష్టికి రావడంతో, సూపరింటెండెంట్‌ సురేష్‌ను అక్కడికి పంపించి లోపల ఉన్న పూజారిని బయటకు రప్పించాలని ఆదేశించాను. సూపరింటెండెంట్‌ గర్భగుడి వద్దకు వెళ్లి లోపల ఉన్న వ్యక్తిని బయటకు వచ్చేమని చెబితే..ప్రధానార్చకుడు, మిగిలినవారు సూపరింటెండెంట్‌పై దాడికి దిగారు. భక్తుల ముందు ఇలా దాడి చేయడం సబబు కాదని ప్రధానార్చకుడికి స్పష్టం చేశాను. ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణ చేపడుతుంది.–కె.శిరీష, ఈవో,సత్యనారాయణ స్వామి ఆలయం

మరిన్ని వార్తలు