అఖిలపక్షానికి వెళ్లే నేతలు వీరే

10 Nov, 2013 21:15 IST|Sakshi

హైదరాబాద్: ఈ నెల 12న ఢిల్లీలో జరిగే అఖిల పక్ష సమావేశానికి వెళ్లే ప్రతినిధులను పేర్లను ఆయా పార్టీలు ప్రకటించాయి. అన్ని పార్టీలు తెలంగాణ నుంచి ఒకరిని, సీమాంధ్ర నుంచి ఒకరిని పంపాలని నిర్ణయించుకున్నాయి.  కాంగ్రెస్ తరపున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి వట్టి వసంత కుమార్ వెళతారు. సిపిఎం తరపున రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ తరపున నారాయణ, జెల్లి విల్సన్, గుండా మల్లేష్ వెళతారు. బిజెపి ప్రతినిధులుగా కిషన్ రెడ్డి, హరిబాబు హాజరవుతారు.

రాష్ట్ర విభజన ప్రక్రియలో  తదుపరి నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం మరోసారి అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేసింది. ఈ నెల  12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర హోంశాఖ  ఖరారు చేసింది. అభిప్రాయాలు తెలియచేయాలని  రాష్ట్రంలోని మొత్తం  ఎనిమిది పార్టీలకు కేంద్రం లేఖ రాసింది.

12న నాలుగు పార్టీలకు, 13న మరో నాలుగు పార్టీలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. మంత్రుల బృందం(జిఓఎం) విడివిడిగా అభిప్రాయాలను సేకరించనుంది. రాష్ట్ర విభజనకు కేబినెట్ ఆమోదించిన విధి విధానాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిపై రాష్ట్ర పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు