‘అప్పు’ముప్పురంబు.. తిరగకపోతే టార్చర్‌ ఉండు..

3 Apr, 2019 09:56 IST|Sakshi

రాజమహేంద్రవరం నగరంలో అప్పుల అప్పారావు అంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన అంతగా ఫేమస్‌.. ఇంతకీ ఆయన ఎవరనేగా మీ ఆత్రుత.. కంగారు పడకండి.. ఇంకెవరు మన స్థానిక ప్రజాప్రతినిధే. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీ గూట్లోకి వెళ్లి పబ్బం గడుపుకుంటున్న ఆ నేత రాజమహేంద్రవాసులను ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఒక్కసారి ఈయన వద్ద అప్పు తీసుకున్న ఏ రాజకీయనాయకుడైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. అదేంటీ? అప్పు తీసుకున్న వాడు తప్పించుకు తిరుగుతాడు గానీ, ఈయన చుట్టూ తిరగడమేంటనేగా మీ డౌటు.. ఆ సందేహం కూడా తీరుతుంది ముందు మీరు పూర్తిగా చదవండి...


సాక్షి ప్రతినిధి, కాకినాడ : చోటా రాజకీయ నాయకులు అడిగిన వెంటనే అప్పు ఇచ్చే సామర్థ్యం ఆయనకు ఉంది. లక్షల్లో అప్పులు పొందే నాయకులను అప్పు కట్టాలని అడిగే ప్రయత్నం చేయడు ఆ అప్పుల అప్పారావు. ఇక్కడే తిరకాసు ఉంది. అప్పు తీసుకున్న ఏ చోటా నాయకుడైనా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండాల్సిందే. అప్పారావు పార్టీ మారితే అతడితో పాటు పార్టీ మారాల్సిందే. ఒకవేళ పార్టీ మారేందుకు ఇష్టం చూపనివారు, తనవెంట పార్టీ మారని వారికి వెంటనే మొదలవుతుంది టార్చర్‌. తన బాకీ అణాపైసలతో చెల్లించి నీ ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోవచ్చని హుకుం జారీ చేస్తారు. ఈ బాధ భరించలేక అప్పులు తీర్చే సత్తా లేక.. చోటా నాయకులు ఆయన వెంట పార్టీ  మారక తప్పదు. ఇలా మాజీ కార్పొరేటర్లు, పలు బ్యాంక్‌ల మాజీ డైరెక్టర్లు ఇష్టం లేకపోయినా పార్టీ మారి వెళ్లిన వాళ్లున్నారు. ఇప్పుడు ఆయన కోడలు ఎన్నికల బరిలో ఉన్నారు. అప్పులు తీసుకున్నోళ్లందరూ ఓటు వేయాలని పట్టుబడుతున్నారు. లేదంటే నయా పైసా వదలకుండా కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తే అప్పు మాఫీ చేస్తానని కూడా అంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. 

హాట్‌పోట్లు ఎదుర్కొని..

అమలాపురం: పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారం జోరును పెంచారు. మరింత ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వారి ప్రచారంపై భానుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. నడినెత్తిన నిప్పులు కురిపిస్తుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు, ద్వితీయశ్రేణి నేతలు, వారి మద్దతుదారులు చెమటలు కక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆది, సోమవారం ఎండతీవ్రత మరింత పెరిగింది. మిట్టమధ్యాహ్నం గరిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి.

ఏజెన్సీలోని చింతూరులో జిల్లాలోనే అత్యధికంగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తరువాత రాజమహేంద్రవరం 39 డిగ్రీలు గరిష్ఠంగా, 24 కనిష్ఠంగాను, కాకినాడ గరిష్ఠంగా 37, కనిష్ఠంగా 25, అమలాపురం గరిష్ఠంగా 36, కనిష్ఠంగా 24, ఏజెన్సీ డివిజన్‌ కేంద్రమైన రంపచోడవరంలో గరిష్ఠంగా 32, కనిష్ఠంగా 23, చివరకు జిల్లాలో అత్యంత చల్లని ప్రాంతమైన మారేడుమిల్లిలో సైతం గరిష్ఠంగా 31, కనిష్ఠంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిట్టమధ్యాహ్నం పెరిగిన ఉష్ణోగ్రతలు ఎన్నికల ప్రచారానికి తీవ్ర అవాంతరాన్ని సృష్టిస్తోంది. ఎండవేడి తాళ్లలేని అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారాన్ని నిలిపివేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న పార్టీ కార్యకర్తలు, అద్దె కార్యకర్తలు సైతం ఇంటింటా తిరిగి ప్రచారం చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు.  

మరిన్ని వార్తలు