‘ముడా’.. అసమ్మతి క్రీడ!

22 Aug, 2018 13:32 IST|Sakshi
ఎంయూడీఏ కార్యాలయం

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ముడా) చైర్మన్‌ నియామకంపై అసంతృప్తి

బూరగడ్డ వేదవ్యాస్‌ నియామకాన్ని నిరసిస్తూ సోదరుడు రమేష్‌ రాజీనామా

బుజ్జగించి తిరిగితెచ్చిన ఎమ్మెల్సీ, సీఎం..

మంత్రి, ఎంపీ వర్గీయుల్లోనూ వ్యతిరేకత

రెండు సార్లు వ్యాస్‌ ప్రమాణ స్వీకారం వాయిదా

సాక్షి, మచిలీపట్నం :  బందరు అభివృద్ధి, పోర్టు భూ సేకరణ తదితర వ్యవహారాలు చక్కదిద్దేందుకు 2016లో ప్రభుత్వం ముడా శాఖను నెలకొల్పింది. అప్పటి నుంచి పాలన, అభివృద్ధిపరమైన వ్యవహారాలు చూసుకునేందుకు డెప్యుటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని  వైస్‌ చైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం అలాగే కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల ఎర వేస్తోంది. ఈ క్రమంలోనే పెడన, బందరులో ఏదో ఒక శాసనసభ్యుడి స్థానాన్ని ఆశిస్తున్న మాజీ డెప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ను ముడా చైర్మన్‌గా నియమిస్తూ ఈ నెల 5వ తేదీ ఉత్తర్వులు వెలువరించింది. ముడా స్థాపించినప్పటి నుంచి నేటి వరకు చైర్మన్‌ నియామక అంశంపై కనీసం చర్చించని టీడీపీ అధిష్టానం ఒక్కసారిగా నామినేటెడ్‌ పదవిని భర్తీ చేయడం టీడీపీ నాయకుల్లో ఓకింత కలవరపాటుకు దారితీసింది.

భగ్గుమన్న విభేదాలు
ముడా చైర్మన్‌గా వ్యాస్‌ పేరు ప్రకటించడంతో ఆ పార్టీలో, అన్నదమ్ముల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముడా చైర్మన్‌గిరి వ్యాస్‌ సోదరుడు బూరగడ్డ రమేష్‌ నాయుడుకు వరిస్తుందన్న అంశం  కొన్ని మాసాలుగా హాట్‌ టాపిగ్‌గా మారింది. ఫలితం వెల్లడయ్యే 5వ తేదీ రాత్రి వరకు ఇదే చర్చ కొనసాగింది. ఇదిలా ఉంటే వ్యాస్‌ తనయుడికి, పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌కు ఉన్న  సత్సంబంధాల నేపథ్యంలో పదవి కేటాయింపులో  అనూహ్యంగా మార్పు చోటుచేసుకుంది. చైర్మన్‌ పీఠం వ్యాస్‌కు దక్కింది. దీంతో శృంగభంగానికి గురైన బూరగడ్డ రమేష్‌ నాయుడు వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మరి కొంతమంది నాయకులు బుజ్జగింపు చర్యలకు దిగారు. రమేష్‌ నాయుడును సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. సీఎంతో భేటీ అనంతరం ఓ మెట్టు కిందకు దిగిన రమేష్‌ నాయుడు ప్రస్తుతం పార్టీలోనే కొనసాగుతున్నారు.

మంత్రి, ఎంపీ వర్గీయుల్లో అసంతృప్తి
మాజీ డెప్యూటీ స్పీకర్‌ వేదవ్యాస్‌ మంత్రి లోకేష్‌ వద్ద చక్రం తిప్పి ముడా చైర్మన్‌ పీఠాన్ని దిక్కించున్న అంశం అటు మంత్రి కొల్లు రవీంద్ర, ఇటు ఎంపీ కొనకళ్ల నారాయణరావు వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసినట్లు సమాచారం. ప్రస్తుతం తాము ఓ బాధ్యతాయుత పదవుల్లో ఉన్నామని, అంతకంటే ముందు స్థానిక ప్రజాప్రతినిధులనే కనీస గౌరవం లేకుండా, తమకు మాట వరసకైనా ఒక్కసారి కూడా సంప్రదించకుండా కార్యం చక్కబెట్టడంపై అసమ్మతితో రగిలిపోతున్నారు. ఇదే విషయాన్ని వారి సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అధిష్టానం అదేశానుసారం ఈ నిర్ణయం వెలువడింది. అధిష్టానం ఆదేశాలను వ్యతిరేకించలేక.. అలాగని స్వాగతించలేక సతమతమవుతున్నారు. పైకి మాత్రం ఇష్టమున్నట్లు నటిస్తున్నా.. లోలోపల మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు మంత్రి కొల్లు రవీంద్రకు అత్యంత ప్రధాన నాయకుడు, మంత్రి మార్గదర్శకుడైన గొర్రిపాటి గోపీచంద్‌ గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవిని ఆశించినా.. నిరాశే మిగిలింది. మంత్రి దేవినేని ఉమా వర్గీయుడైన బండారు హనుమంతరావు గ్రంథాలయ చైర్మన్‌ పీఠం కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న గోపీచంద్‌ ముడా చైర్మన్‌ పదవినైనా దక్కించుకోవాలన్న తపనతో లోలోపల కథ నడిపినట్లు తెలిసింది. అంత చేసినా చివరికి అనుకున్న ఫలితం దక్కలేదు. దీంతో మంత్రి కొల్లు వర్గంలో వ్యతిరేకత వ్యక్తవుతోంది.

ప్రమాణ స్వీకారంపై అంతర్మథనం  
ముడా చైర్మన్‌ పీఠం దక్కించుకున్న వేదవ్యాస్‌ ఈ నెల 16వ తేదీ భారీ స్థాయిలో జన సమీకరణ, ఏర్పాట్లు చేసి ప్రమాణ స్వీకారం చేయాలని తలచారు. స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మంత్రి దేవినేని ఉమతో పాటు పార్టీలోని క్రియాశీలక నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించాలని భావించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరి వద్దకు నేరుగా వెళ్లి కలిసే పనిలో నిమగ్నమయ్యారు. మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ మాత్రం తమకు వీలులేదు.. ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకోమని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. వారి మాట మేరకు 16న జరగాల్సిన కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు కూడా ఇదే పద్ధతి పునరావృతం కావడంతో ఏం చేయాలో తెలియక మరోసారి ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. ఈ సారి ఎప్పుడన్న స్పష్టత సైతం ఇవ్వలేదు. దీంతో ప్రమాణ స్వీకారం ఎప్పుడవుతుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉంటే.. అన్ని వర్గాలను అసమ్మతి నుంచి బయటకు లాగేందుకు ఒక్కో వర్గం నుంచి ఒక వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు