బెదిరింపనుకోండి.. వార్నింగనుకోండి!

16 Mar, 2019 08:36 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీపీ భర్త ముకుందనాయుడు

ఎన్నికల్లోపు టీడీపీ వైపు ఉండాలి..

లేకుంటే తీవ్ర ఇబ్బందులుంటాయ్‌

మంత్రి పరిటాల సునీత సమక్షంలో ఎంపీపీ భర్త హెచ్చరికలు

సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న బెదిరింపులు తారస్థాయికి వెళ్తున్నాయి. వారి మాటాలు సామాన్య ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బరితెగింపులకు దిగుతుండడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. నిజంగా వారిని గెలిపిస్తే కలిగే ఇబ్బందులను తలుచుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ‘నన్ను గెలిపించండి. ఎమ్మెల్యే కాగానే ఆర్నెల్లు అవకాశం ఇస్తా. ప్రత్యర్థులను కాళ్లు చేతులు విరచండి. చంపుతారా చంపండి. నేను చూసకుంటా’నని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బెదిరించిన వైనం మరువకముందే రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి ఎంపీపీ భర్త చేసిన బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘వచ్చేది మా ప్రభుత్వమే. పరిటాల శ్రీరామ్‌ అసెంబ్లీకి పోతాడు. ఎన్నికలలోపు అందరూ తెలుగుదేశం వైపు రావాలి. లేదంటే మీ ఇష్టం’ అంటూ కనగానపల్లి ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు బీసీ, ఎస్సీలను బహిరంగంగా బెదిరింపులకు గురి చేశారు. ఈ నెల 13న కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల పంచాయతీ తల్లిమడుగుల గ్రామంలో మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్వయానా మంత్రి సమక్షంలో బహిరంగ సభలో ఎంపీపీ భర్త ఇచ్చిన వార్నింగ్‌ దుమారం రేపుతోంది. ‘కచ్చితంగా మళ్లీ మేమే అధికారంలో ఉంటాం. పరిటాల శ్రీరామ్‌ అసెంబ్లీకి వెళ్తాడు. గుర్తు పెట్టుకోండి. బెదిరింపు అన్నా అనుకోండి, వార్నింగ్‌ అన్నా అనుకోండి. పద్ధతిగా ఉండండి. మారేందుకు అవకాశం ఇస్తున్నాం. ఎన్నికల్లోపు ఈ పక్క ఉండాలి. పొరబాటు జరిగిందంటే మాత్రం వచ్చే మా ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. దీనికి రెడీగా ఉండండి’ అంటూ హెచ్చరించారు. 


పరిటాల కుటుంబ దౌర్జన్యాలకు పరాకాష్ట 
పరిటాల కుటుంబం సాగిస్తున్న దౌర్జన్యాలకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోందని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తాము చేసే మంచి పనులను ప్రజలకు వివరించి, వారిలో అభిమానం సంపాదించి ఓట్లు వేయించుకోవడం తప్పు కాదని, అయితే బలవంతంగా తమ పార్టీకే ఓట్లు వేయాలనే ధోరణిలో బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పరిటాల శ్రీరామ్‌ సూచనల మేరకే ముకుందనాయడు ఇలా బెదిరిస్తున్నారని, ఆయన్ను గెలిపిస్తే ఆరాచకాలు మితిమీరిపోతాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు ఓటు ద్వారా బుద్ధి చెబుదామని స్పష్టం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు