రుణం..అందనంత దూరం!

28 Jul, 2014 00:17 IST|Sakshi
రుణం..అందనంత దూరం!

కర్నూలు(అగ్రికల్చర్):  కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందడం లేదు. రుణ అర్హత కార్డులు ఇస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో కౌలు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం గత నెల 27 నుంచి ఈనెల 20వ తేదీ వరకు గ్రామగ్రామాన సభలు నిర్వహించింది. అయితే  రుణ అర్హత కార్డుల కోసం 42 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీటితో ప్రయోజనం లేదని తెలియడంతో చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రాలేదు. కౌలు రైతులను ఆదుకునేందుకు 2011లో ‘సాగు రైతుకు రక్షణ హస్తం’ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా మండలాల వారీగా తహశీల్దార్లు కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులను జారీ చేస్తున్నారు.

వీటి ఆధారంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంది. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కౌలుదారులకు వీటిలో ఏ ఒక్కటీ లభించడం లేదు. ఒక్క ఏడాది మాత్రమే చెల్లుబాటు అయ్యే విధంగా పంపిణీ చేస్తున్న రుణ అర్హత కార్డుల ఆధారంగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. మొదటి ఏడాది అంటే 2011లో 58 వేల మందికి రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు. బ్యాంకర్లపై కలెక్టర్ ఒత్తిడి తీసుకురావడంతో కౌలు రైతులతో గ్రూపులు తయారు చేయించి 17,500 మందికి రూ.35 కోట్లు రుణాలుగా ఇచ్చారు.


 ఈ మొత్తం పంట వచ్చిన తర్వాత రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదనేది బ్యాంకర్లు చెబుతన్నారు. దీంతో మరుసటి ఏడాది నుంచి కౌలుదారులకు రుణాలు ఇవ్వడాన్ని పూర్తిగా తగ్గించారు . 2012లో 18,500 మందికిగాను 2,500 మందికి మాత్రమే రూ.5 కోట్లు రుణాలు ఇచ్చారు.
 
 2013లో 35 వేల మందికిగాను వెయ్యి మందికి కోటి రూపాయలు రుణాలుగా ఇచ్చారు. గత మూడేళ్లలో మొత్తం 1.08 లక్షల మందికి రుణ అర్హత కార్డులు పంపిణీ చేయగా 21 వేల మందికి 41 కోట్ల రుణాలు ఇచ్చినా రికవరీ జీరో ఉన్నట్లుగా బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది కచ్చితంగా కౌలుదారులకు రుణాలు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అధికారులకు ఆదేశాల జారీ చేశారు. రు ణాలు ఇవ్వండి.. రికవరీ చేయించే బాధ్యతను తాము తీసుకుంటామని ఉపముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం బ్యాంకర్లకు భరో సా ఇస్తోంది. వీరి ఆదేశాలు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తాయో వేచి చూడాల్సిందే.
 
 రెండేళ్లుగా తిరుగుతున్నా
 కొన్నేళ్లుగా భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. 2012-13 సంవత్సరంలో ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ, పత్తి పంటలు వేశాను. గత రెండు సంవత్సరాలు రుణ అర్హత కార్డులు తీసుకుని బ్యాంకులకు వెళితే ఎవ్వరూ పట్టించుకోలేదు. సక్రమంగా డబ్బు చెల్లిస్తానన్నా వినిపించుకోలేదు. బయట అధిక వడ్డీతో అప్పు తీసుకుంటున్నా. వ్యవసాయం కలిసిరాక జీవనం భారమవుతోంది. బ్యాంకోళ్లు పట్టించుకోనప్పుడు ఈ కార్డులతో ఉపయోగమేమి?
 - తెలుగు చంద్ర, కౌలుదారుడు, పెండేకల్, తుగ్గలి మండలం
 
 కౌలుదారుల జాబితాలు రాలేదు
 2014 సంవత్సరానికి సంబంధించి బ్యాంకులకు ఇంకా కౌలుదారుల జాబితాలు రాలేదు. మండలాల వారీగా వెంటనే బ్యాంకులకు ఇవ్వాలని కలెక్టర్ ఇటీవల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రుణ అర్హత కార్డుల ఆధారంగా కౌలుదారులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. రికవరీ లేదనే ఉద్దేశంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అయినా ఈసారి రికవరీ బాధ్యత తీసుకుంటామని కలెక్టర్ చెబుతుండటంతో రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం.               
 - నరసింహారావు, ఎల్‌డీటీఎం
 

మరిన్ని వార్తలు