-

కౌలు రైతుకు మొండిచేయి

29 Dec, 2013 04:57 IST|Sakshi

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: కౌలు రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కనీసం ఆ వర్గం వారికి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదు. ఏటా రైతుల్లో వ్యవసాయంపై ఉన్న ఆసక్తి సన్నగిల్లుతుండటంతో జిల్లాలో వ్యవసాయ భూములు క్రమేపీ బీడువారే ప్రమాదం ముంచుకొస్తోంది. ప్రభుత్వం కనీసం కౌలు రైతుల ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. కౌలు రైతులు, రైతు సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి 2011లో కౌలు రైతుల రక్షణ హస్తం అన్న పథకాన్ని ప్రవేశపెట్టింది. రక్షణ హస్తం నియమ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి.  
 1.50 లక్షల మంది కౌలు రైతులు:
 జిల్లాలో 1.50 లక్షల మంది కౌలు రైతులున్నారు. పదేళ్ల నుంచి రైతులు వ్యవసాయంలో వరుసగా నష్టాలు చవిచూడడంతో పంటలు సాగు చేయకుండా సొంత భూములను కౌలుకు ఇవ్వడం ప్రారంభించారు. వ్యవసాయ పనుల్లో చేయి తిరిగినవారుగా గ్రామాల్లో మంచి పేరుండే అలాంటి వారు కౌలు రైతులుగా మారి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు.  
 ప్రతి ఏడాది తగ్గుతున్న కార్డులు:
 జిల్లావ్యాప్తంగా కౌలు రైతులను గుర్తించి అధికారులు కౌలు రైతుల రక్షణ హస్తం పథకం కింద ఇవ్వాల్సిన రక్షణ హస్తం కార్డుల వ్యవహారం ప్రహసనంగా మారింది. రెవెన్యూ యంత్రాంగం సంబంధిత శాఖల అధికారులతో కలిసి గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించాల్సి ఉంటే దాన్ని పూర్తిగా విస్మరించారు. దీంతో కౌలు రైతుల సంఖ్య మొండిచేయి
 
 ఏటికేడాది తగ్గుతూ పోతోంది. వాస్తవానికి జిల్లాలో 1.50 లక్షల మందికి పైగా కౌలు రైతులున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు మరీ దారుణంగా ఉన్నాయి.
 సంవత్సరం    కార్డుల సంఖ్య
 2011-12    14,503
 2012-13    8,149
 2013-14    5,213
 ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తగా కార్డులు తీసుకోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
 రుణ అర్హత కార్డులున్నా..
 రుణం సున్నా:
 కౌలుదారుల రక్షణ హస్తం కింద రుణ అర్హత కార్డులు ప్రభుత్వం మంజూరు చేసినా బ్యాంకులు రుణాలివ్వకుండా తిప్పుకుంటున్నాయి. అసలు కార్డులు ఇవ్వడమే గగనంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు  కూడా సహకరించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. రైతు సంఘాలు బలంగా ఉన్న చోట బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెస్తే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జేఎల్‌జీ) కింద అక్కడ కూడా మొక్కుబడిగా ఇస్తున్నారే తప్ప కౌలు రైతుకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలగడం లేదు. దీంతో బయట అప్పులు చేసి అధిక వడ్డీలకు పంట రుణాల కోసం తెచ్చిన పెట్టుబడికి అసలుకు మించి వడ్డీ భారమవుతోంది.
 జిల్లాలో పంటల పరిస్థితి విభిన్నం:
 రాష్ట్రం మొత్తం వ్యవసాయ సీజన్ పరిస్థితి ఒకరకంగా ఉంటే జిల్లా పరిస్థితి మరో రకంగా ఉంటుంది. పూర్తిగా భిన్నంగా ఉండడం కౌలు రైతులకు కొంత ఇబ్బందిగా మారుతోంది.  పొరుగు జిల్లాలైన గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఖరీఫ్ జూన్‌లోనే ప్రారంభమవుతుంది. కానీ జిల్లాకు వచ్చేసరికి ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడం వల్ల సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు, కౌలు రైతులు పంటల సాగుకు ఉపక్రమించరు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసే వర్షాలే ఈ ప్రాంత రైతాంగానికి దిక్కు. దీంతో జూన్‌లో రైతుల వద్ద నుంచి కౌలుకు పొలాలు కుదుర్చుకోవడం వీలు పడదు. అధికారులు మాత్రం ఏప్రిల్ నెల నుంచే రక్షణ హస్తం కోసం కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెడుతున్నారు. అదెలా సాధ్యమవుతుంది. జిల్లాలో ప్రాంతాల వారీగా సీజన్ మొదలవుతుంది. పర్చూరు, అద్దంకి, మార్టూరు, చీరాల ప్రాంతాల్లో నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాల కింద జులైలో పంటలకు ఉపక్రమిస్తే... మార్కాపురం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పంటల సాగుకు పూనుకుంటారు.
 సమావేశమే పెట్టని కలెక్టర్...
 కౌలు రైతుల ప్రయోజనం కోసం ఏటా విధిగా సమావేశం నిర్వహించాలన్న నిబంధనకు సాక్షాత్తూ  కలెక్టరే నీళ్లొదిలారు. కలెక్టర్  చైర్మన్‌గా ఉన్న కౌలు రైతులు ఈ ఏడాది సమీక్ష సమావేశం నిర్వహించకపోవడంతో అసలు ఆ వర్గం వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ఏడాదిలో విధిగా నిర్వహించాల్సిన సమావేశం రబీ సీజన్ సగాన పడినా కూడా నిర్వహించకపోవడంపై కౌలు రైతులు నిరాశ చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలతో నిర్వహించాల్సిన సమావేశాన్ని ఇప్పటికైనా నిర్వహించి కౌలు రైతుల ప్రయోజనాలు కాపాడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు