దేశం అన్ని రంగాల్లో కుంటుపడింది

13 Oct, 2019 16:56 IST|Sakshi

బీజేపీ విధానాలపై వామపక్షాల సదస్సు

సాక్షి, విజయవాడ: బీజేపీ విధానాలతో దేశంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీవీకే భవన్‌లో ‘కార్పొరేట్లకు వరాలు -సామాన్యులపై భారాలు’ అనే అంశంపై వామపక్షాల సదస్సు జరిగింది. బీజేపీ విధానాలను వామపక్షాలు ఎండగట్టాయి. ఈ సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ..ఆర్థిక మాంద్యం తో అన్ని రంగాలు కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని కూడా కార్పొరేట్లకు రాయితీలతో అనుకూలంగా మారుస్తున్నారని విమర్శించారు.

ధనిక వర్గాలకు మోదీ ప్రభుత్వం ఊడిగం..
అన్ని ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్సంస్థలను ప్రోత్సహిస్తున్నారన్నారు. డబ్బున్న వర్గాలకు మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు. అంబానీ, ఆదానీలు వేలకోట్లకు పడగ లెత్తుతున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తుందని.. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రస్తావించారు.16న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త రాస్తారోకోలో భాగంగా విజయవాడలో రాస్తా రోకో నిర్వహిస్తున్నామని తెలిపారు.

దసరాకు కొట్టొచ్చినట్టు కనబడింది: మధు
ఆర్థిక మాంద్యం తీవ్రత దసరా పండుగకు కొట్టొచ్చినట్టు కనబడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.  దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 10 శాతం నిరుద్యోగం నమోదయిందన్నారు. బ్యాంకుల వద్ద సొమ్ము తీసి కార్పొరేట్ రంగానికి రాయితీలు ప్రకటించారని మండిపడ్డారు. పన్నులు తగ్గించి, రాయితీలు ప్రకటించడం వలన ప్రభుత్వానికి రాబడి తగ్గిపోతుందన్నారు.  రాయితీలలో వచ్చిన సొమ్ము భారతదేశంలో పెట్టుబడి పెట్టడం లేదని.. విదేశాలకు తరలిస్తున్నారన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన రాయితీల వలన మాంద్యం మరింత అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని సూచించారు.

నిరుద్యోగ భృతి ఇవ్వాలి...
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని.. ప్రభుత్వ పనులకు నిధులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 21 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగాల  ప్రైవేటీకరణ నిలిపివేయాలన్నారు. 100 శాతం విదేశీ పెట్టుబడులు వాపసు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, ఆత్మహత్యలు నిరోధించాలన్నారు. దేశవ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్ 3 వేల రూపాయలు పెంచాలని  డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు