అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు!

2 Sep, 2014 02:00 IST|Sakshi

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వామపక్షాలు

విజయవాడ: ఎన్నికల హామీలను పదే పదే వల్లె వేస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపుతున్నారే తప్ప వాస్తవానికి చేసిందేమీ లేదని ఏపీ సీఎం చంద్రబాబుపై వామపక్షాలు నిప్పులు చెరిగాయి. రుణమాఫీ పేరుతో అధికారం చేపట్టిన బాబు.. ఇప్పుడా అంశంపై పలు నిబంధనలు విధిస్తూ రైతులను ఏమారుస్తున్నారని విరుచుకుపడ్డాయి. ఎన్నికల హామీలను తక్షణమే అమల్లో పెట్టాలని పది వామపక్ష పార్టీలూ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. బాబు 3 నెలల పాలన, ఎన్నికల హామీలపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 24న విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపాయి.
 
సోమవారం ఇక్కడ నిర్వహించిన పది వామపక్ష పార్టీల మహాభేటీలో ఈ మేరకు తీర్మానించారు. భేటీ అనంతరం సీపీఎం పక్షాన ఆ పార్టీ ఏపీ కార్యదర్శి పి. మధు, సీపీఐ పక్షాన ఆ పార్టీ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. బాబు ప్రభుత్వం కౌలు రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీని విస్మరించిందని దుయ్యబట్టారు. 24న నిర్వహించే సదస్సులో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. వామపక్షాలన్నీ కలసి విద్యుత్ ఉద్యమం తరహాలో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు.
 
మహా భేటీలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, సత్యానారాయణ మూర్తి, సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకురాలు రమ, రవిచంద్ర, సీపీఎ(ఎంఎల్) నాయకులు గుర్రం విజయకుమార్, ఆర్‌ఎస్‌పీ నాయకులు జానకీరామయ్య, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు బి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు