మండలి రద్దుపై లెఫ్ట్‌ యూ టర్న్‌! 

27 Jan, 2020 05:09 IST|Sakshi

కమ్యూనిస్టు అగ్రనేతల తీరుపై ఆయా పార్టీల కార్యకర్తల అసహనం 

ఎన్టీ రామారావు రద్దు చేసినప్పుడు మద్దతు ఇచ్చారు కదా! 

నాయకత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారాలా?  

సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు, శాసన మండలి వంటివి దండగమారి వ్యవస్థలుగా అభివర్ణించిన కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం యూ టర్న్‌ తీసుకున్నాయి. ఈ రెండు వ్యవస్థలు ఆరో వేలు లాంటివని, వీటివల్ల ప్రజాధనం వృథా కావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని గతంలో వాదించిన లెఫ్ట్‌ పార్టీలు ప్రస్తుతం అందుకు భిన్నమైన గళం వినిపిస్తుండడం గమనార్హం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి రద్దు ప్రతిపాదన చేసినప్పుడు అందుకు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు ఇప్పుడు స్వరం మార్చారు.  

విధానాలు మారిపోతాయా?  
రాష్ట్రంలో శాసన మండలి రద్దు ఆలోచనే అప్రజాస్వామికమని సీపీఎం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలనే రద్దు చేస్తారా? అని సీపీఐ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయా పార్టీల్లోని సీనియర్‌ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వాలు మారినప్పుడల్లా కమ్యూనిస్టు విధానాలు మారిపోతాయా? అని నిలదీస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని తాము సమర్థించామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సీనియర్‌ కమ్యూనిస్టు నేత ఒకరు గుర్తుచేశారు.  

ప్రస్తుతం 6 రాష్ట్రాల్లోనే..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి. ఇటీవలి వరకు జమ్మూకశ్మీర్‌లోనూ మండలి ఉండేది. రాష్ట్ర హోదా రద్దయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన తర్వాత అక్కడ కూడా శాసన మండలి రద్దయ్యింది. అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు ఉండేవి. తర్వాత అవి రద్దయ్యాయి. శాసన మండళ్లు వద్దని చెబుతున్న కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సిల్‌ను రద్దు చేస్తామనే ప్రతిపాదన వచ్చీ రాకమునుపే అన్యాయం, అప్రజాస్వామికం అనడం దేనికి సంకేతమని సీనియర్‌ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు