తెగిన కాలుతో వచ్చి.. నడిచి వెళ్లాడు

16 May, 2018 12:39 IST|Sakshi
మూడేళ్ల క్రితం ప్రమాదానికి గురైన సమయంలో లోకేష్‌(ఫైల్‌) ,మంగళవారం నడిచి వస్తున్న లోకేష్‌

పెద్దాసుపత్రిలో రోడ్డు ప్రమాద బాధితునికిఅరుదైన శస్త్రచికిత్స

నాలుగేళ్లలో ఆరుసార్లు ఆపరేషన్‌

రోడ్డుప్రమాదంలో యువకుడు  తీవ్రంగా గాయపడటంతో  మోకాలు వరకు తెగిపోయిన పరిస్థితి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళిలే మా చేతకాదన్నారు. తెగిన కాలును అలాగే పట్టుకుని వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికొచ్చారు. ఇక్కడి వైద్యులు  పలు  శస్త్రచికిత్సలు చేసి  అతను సొంతంగా నడిచి వెళ్లే పరిస్థితికి తెచ్చారు. మంగళవారం ఆసుపత్రిలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో హెచ్‌ఓడీ డాక్టర్‌ మంజులబాయి ఆ వివరాలు వెల్లడించారు.  

కర్నూలు(హాస్పిటల్‌): అనంతపురం జిల్లా సీకే పల్లి మండలం గంగినేపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, వెంకటలక్ష్మి కుమారుడైన సాకె లోకేష్‌ స్థానికంగా వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను 2014 డిసెంబర్‌ 4వ తేదీన ధర్మవరం సబ్‌జైలు సమీపంలో బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. అదే సమయంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ అతని కాలుపై ఎక్కింది. అతను గట్టిగా అరిచేలోగా మళ్లీ అలాగే వెనక్కి రావడంతో మరోసారి కాలుపై టైరు ఎక్కింది. దీంతో అతని మోకాలు వరకు ఎముకలు, కండరాలు, నరాలు  తెగిపోయాయి. వేలాడుతున్న కాలును అలాగే పట్టుకుని కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. లోకేష్‌ పరిస్థితిని చూసి మా వల్ల కాదని అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేశారు. అదే రోజు వెంటనే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చిన లోకేష్‌ను ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ రఘునందన్‌ ఆధ్వర్యంలో చికిత్స అందించారు.

ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ మంజులబాయి, డాక్టర్‌ రాజారవికుమార్, డాక్టర్‌ సావిత్రి, అనెస్తెషియా విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ ఉమామహేశ్వర్‌ సంయుక్తంగా అతనికి ఆపరేషన్‌ చేశారు. పలుమార్లు బోన్‌ రీ కన్‌స్ట్రక్షన్, పోస్ట్‌ రియరిర్‌ ట్రిబియల్‌ ఆర్టరి రీ కన్‌స్ట్రక్షన్‌ వంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ విధంగా అప్పట్లో లోకేష్‌ మూడు నెలలు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లి మొదట్లో ప్రతి 15 రోజులకు, ఆ తర్వాత నెలకోసారి ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. అలా మూడేళ్లు చికిత్స పొందిన అనంతరం గత 8 నెలల నుంచి నడవడం ప్రారంభించాడు. మొదట్లో ఏదైనా ఆధారంతో నడిచేవాడు. ఇప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా ఒక్కడే నడవగలుగుతున్నాడు. వైద్యులు ఎంతో కష్టపడి తనకు కాలును ప్రసాదించారని లోకేష్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను ఆర్థోపెడిక్, అనెస్తీషియా విభాగాల సంయుక్త సహకారంతో విజయవంతంగా చేయగలిగినట్లు డాక్టర్‌ మంజులబాయి చెప్పారు. 

మరిన్ని వార్తలు