రైతుల పక్షాన న్యాయపోరాటాలు

7 Jan, 2015 02:31 IST|Sakshi
మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న జస్టిస్ లక్ష్మణరెడ్డి. చిత్రంలో అంబటి రాంబాబు, తులసిరెడ్డి, మధు, రామచంద్రయ్య తదితరులు

 ఏపీ రాజధానిపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
రాజధాని ప్రాంత రైతుల్లో ధైర్యం నింపేందుకు అన్ని పక్షాలు కలసిరావాలని పిలుపు
 ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని తీర్మానం
 
 సాక్షి, హైదరాబాద్: ఖాకీల నీడలో మానవ హక్కుల్ని హరిస్తూ రాజధాని ప్రాంత రైతుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వ విపరీత పోకడలను ఉద్యమ రూపంలో ఎదుర్కోవాల్సి ఉందని ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి రైతుల్లో మనోధైర్యం నింపాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని పేర్కొంది. న్యాయపోరాటాలతో పాటు ప్రజా పోరాటాలు నిరాటంకంగా కొనసాగించాలని, కరపత్రాలతో ప్రచారం చేయాలని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విశాల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ దుశ్చర్యల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని అభిప్రాయపడింది. ఇందుకు అభ్యుదయవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని వక్తల ఏకాభిప్రాయంతో తీర్మానించింది. సమావేశంలో పాల్గొన్న వక్తలంతా ప్రభుత్వం భూములు సమీకరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి మినహాయించాలని తీర్మానం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంగా ఎంపికచేసిన మండలాల్లో వైవిధ్యం గల పంటల ఫొటో ఎగ్జిబిషన్, ఏపీ రాజధానిపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. తొలుత జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రైతులు భూ సమీకరణకు ఒప్పుకోకుంటే బలవంతపు భూ సేకరణ చేపడతామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లో రాజధాని నిర్మాణానికి బలవంతపు సేకరణకు అవకాశం లేదని చెప్పారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ మన దేశ సంస్థలే ఇతర దేశాల్లో భారీ నిర్మాణాలు చేస్తుంటే సింగపూర్ సహకారం ఎందుకని ప్రశ్నించారు.  


 రైతుల పక్షాన ఉంటాం: వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భూములు ఇవ్వనన్నాడనే కారణంతో ఆ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనాథ్‌చౌదరిని పోలీసులు తీసుకెళ్లారని, వారం రోజులుగా ఆయన జాడ లేదని చెప్పారు. పోలీసుల దాష్టీకాన్ని ప్రపంచానికి చెప్పేందుకు అన్ని రాజకీయ పక్షాలు కలసి ఉద్యమ బాట పట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన కడవరకు పోరాడుతుందని చెప్పారు. రైతు ఉద్యమనేత అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పొలాల్లో 120 రకాల పంటలను పండిస్తున్నారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ విధానం చట్టవిరుద్ధమైందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్  నాగిరెడ్డి మాట్లాడుతూ 2011లో రైతుల భూముల జోలికొస్తే ఖబడ్దార్ అన్న బాబు ఇప్పుడు భూ సమీకరణకు అడ్డువస్తే ఖబడ్దా ర్ అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏ విషయంలోనైనా నష్టం జరుగుతుందంటే సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్ రైతులకు అనుకూలంగా నిర్ణయా లు తీసుకునే వారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, సీపీఐ ఎం.ఎల్. నేత గుర్రం విజయకుమార్, హైకోర్టు న్యాయవాది జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడారు.
 
 ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్
 జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల ఫొటో ఎగ్జిబిషన్ పలువురిని ఆకట్టుకుంది. సమావేశానికి ముందు జస్టిస్ లక్ష్మణరెడ్డి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఫొటోల్లో పంటలను రైతు నాయకుడు ఎ.గాంధీ వివరించారు.

మరిన్ని వార్తలు