ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

4 Jun, 2015 03:40 IST|Sakshi
ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

- జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు
- వచ్చే నెల 3న ఎన్నికలు
- మొత్తం ఓటర్లు 1,192
- రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం
విజయవాడ :
జూలై 3న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కసరత్తులు ప్రారంభించింది.  కృష్ణాజిల్లా స్థానిక సంస్థల రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ బాబు.ఎ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ  రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ వేరు, వేరుగా నిర్వహిస్తామని, ఓటర్లు రెండింటికి రెండు ఓట్లు వేయాలన్నారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాలో 1,192 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 650 మంది మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు.

రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒకొక్క పోలింగ్ కేంద్రం చొప్పున జిల్లాలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. మచిలీపట్నం, గుడివాడ, ఎంపీడీవో కార్యాలయాల్లో, నూజివీడు ఎస్.ఆర్.ఆర్.బాలుర ఉన్నత పాఠశాలలో, వియవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  ఒకొక్క  పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఓటు హక్కు కల్గిన పదవీరీత్యా సభ్యులు నగర పంచాయతీ వార్డు సభ్యులు ఓటర్లుగా ఉంటారని కలెక్టర్ వివరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఓటరు నెంబరును ఆధార్ కు అనుసంధానం చేసేందుకు ఓటర్లందరూ తప్పనిసరిగా ఆధార్ నంబరు కలిగి ఉండాలని కలెక్టర్ కోరారు.

ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉయ్యూరునగర పంచాయతీ కౌన్సిలర్ అబ్దుల్ రహమాన్, విజయవాడ రూరల్ ఎంపీటీసీ సౌజన్యలకు ఆధార్ నంబర్లు లేవని గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. మచిలీపట్నం రూరల్ ఎంపీటీసీ సభ్యురాలు పి.సీతామహలక్ష్మికి ఎపిక్ కార్డు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు, బీజేపీ నేత రామినేని వెంకట కృష్ణ, బీఎస్పీ నుంచి కిరణ్‌కుమార్, దాసన్ పాల్గొన్నారు.

ఎన్నికల షెడ్యూలు
ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9న విడుదల చేస్తారు. 16వ తే దీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన చేస్తా రు. 19న పోటీ నుంచి విరమించేందుకు చివరి తేదీ. జూలై 3వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 7వ తేదీ ఉదయం 8గంటలకు ప్రారంభిస్తారు.

ఖాళీ అయిన స్థానాలు
జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఐలాపురం వెంకయ్య, పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగిసింది. మరొక స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ పదవీకాలం 2013 మార్చి 29తో పూర్తయింది. 

మరిన్ని వార్తలు