బీజేపీలో ‘స్థానిక’ పోరు!

6 Apr, 2014 02:15 IST|Sakshi
  • పొత్తులతో చిక్కులు
  •  స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్న నేతలు
  •  గెలుపే ముఖ్యమంటున్న మరి కొందరు నేతలు
  •  సాక్షి, విజయవాడ : టీడీపీతో పొత్తు బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పొత్తు దాదాపుగా ఖరారవుతుండటంతో టికెట్లు ఆశించేవారిలో ఆందోళన ప్రారంభమయింది. పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమం, కైకలూరు అసెంబ్లీ సీట్లలో ఒకటి రెండే బీజేపీకి దక్కే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత పోరు మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు తమకే కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు.

    అయితే పశ్చిమం లేదా కైకలూరు సీట్లలో ఒకటే ఇస్తామంటూ టీడీపీ నేతలు సూచిస్తున్నారు. చివరకు సెంట్రల్ బీజేపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారికే అవకాశం కల్పించాలని, కొత్తవారిని తీసుకొస్తే ఊరుకొనేది లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే నిరసన గళం వినిపిస్తున్నారు.

    హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకునేవారి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగమేమీ ఉండదని సలహాలిస్తున్నారు. వారు గెలి చినా, ఓడిపోయినా హైదరాబాద్‌లోనే ఉంటారని, దీనివల్ల స్థానికంగా పార్టీ అభివృద్ధి చెందదని పేర్కొంటున్నారు. బీజేపీ కూడా టీడీపీలాగానే ‘కార్పొరేట్ సంస్థ’గా మారిపోయిం దని, హైదరాబాద్‌లో నేతలకు డబ్బు సంచులు ఇచ్చి సీట్లు తెచ్చుకోవచ్చని కొంతమంది నేతలు భావిస్తున్నారని, అందువల్లనే స్థానికేతరుడికి సీటు ఇవ్వకూడదని బలంగా వాదిస్తున్నారు.

    ఏనాడూ పార్టీ జెండా పట్టుకోనప్పటికీ ముఖ్యనేతలను సంతృప్తి పరిచి బీఫారంతో దిగుమతి అయితే సహించబోమని ఈ సందర్భంగా తేల్చిచెబుతున్నారు. స్థానికుల కోటాలో బీజేపీ సీమాంధ్ర కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సీనియర్ నేతలు వీరమాచినేని రంగ ప్రసాద్, రామసాయి తదితర పేర్లు పరిశీలించవచ్చని సూచిస్తున్నారు.
     
    గెలుపుగుర్రాలపైనే దృష్టిపెట్టాలి
     
    సెంట్రల్ సీటు బీజేపీకి దక్కితే పార్టీని గెలిపించే వారికే అవకాశం కల్పించాలి తప్ప స్థానికుడికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అర్బన్ పార్టీలోనే మరికొంతమంది నేతలు వ్యాఖానిస్తున్నారు. సీనియార్టీనే ప్రాధాన్యతగా తీసుకుంటే జనసంఘ్ నుంచీ పనిచేసే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారని, వారికే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గతంలో టికెట్ ఆశించి భంగపడి, కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి ‘స్థానికుడికే సీటు’ అంటూ కొత్తవాదనలు  తెస్తున్నార ని ఈ వర్గం వాదిస్తోంది.

    బీజేపీకి ఉన్న ఓటింగ్‌కు తోడు తన ప్రభావంతో పార్టీకి పది ఓట్లు తీసుకొచ్చే అభ్యర్థి అవసరమని, కేవలం సీనియార్టీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ వర్గాలతో మంచి సంబంధాలు, సినీ రంగంతో పరిచయం ఉన్నవారైతే నాలుగు ఓట్లు  ఎక్కువ వస్తాయని వివరిస్తున్నారు.

    కొత్తవారి కోటాలో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది. పశ్చిమం, కైకలూరు సీటు లభించినా అక్కడ నుంచి కూడా పోటీ చేసేందుకు నలుగురైదుగురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే లభించే ఒకటి రెండు సీట్ల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం.
     

మరిన్ని వార్తలు