వేటగాళ్ల చేతిలో చిరుత హతం

25 Dec, 2018 11:22 IST|Sakshi
గ్రామస్తుల చేతిలో మృతి చెందిన చిరుత చిరుతను కాల్చేస్తున్న గ్రామస్తులు

అనంతపురం  ,కంబదూరు: తమపై దాడి చేస్తుందేమోనన్న భయంతో చిరుతపైకి వేటగాళ్లు తిరగబడ్డారు. ప్రాణ రక్షణ కోసం చిరుతను హతమార్చారు. కంబదూరు మండలం కొత్తూరు గ్రామ సమీపాన పెన్నానది ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అడవి పందుల వేట కోసం కుక్కలను వెంటబెట్టుకుని అడవిలోకి వెళ్లారు. పెన్నానది పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో కుక్కలు నిలేశాయి. ఈ సమయంలో తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని వేటగాళ్లు ప్రాణ రక్షణ కోసం వెంట తీసుకెళ్లిన కత్తులు, కర్రలతో చిరుతపై దాడి చేసి చంపేశారు.

ఆ తర్వాత చిరుతను గ్రామంలోకి తెచ్చి కాల్చేశారు. సమాచారం తెలుసుకున్న డీఎఫ్‌ఓ చంద్రశేఖర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో విచారణ చేసి ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా ఉన్నట్లు ఫారెస్ట్‌ అధికారులు గుర్తించారు. నిందితులందరిపైనా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ శివప్రసాద్, తహసీల్దార్‌ మసూద్‌వలి, ఎస్‌ఐ రాగిరి రామయ్యతో పాటు ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కూడా పరిశీలించారు. 

మరిన్ని వార్తలు