చిరుతల హల్‌చల్‌

25 May, 2018 08:49 IST|Sakshi
చిరుతల దాడిలో చనిపోయిన జింక ,చిరుతలను అన్వేషిస్తున్న అధికారులు

జింకను చంపేసిన చిరుతలు

వణికిపోతున్న ఆలూరు వాసులు

కణేకల్లు: కణేకల్లు మండలం ఆలూరు వద్ద చిరుతల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం ఉదయం రెండు చిరుతలు ఓ జింకను చంపేడంతో గ్రామస్తులకు కంటిమీద కనుకు లేకుండా పోతోంది. ఆలూరుకి కొంత దూరంలో బుధవారం ఉదయం రైతు యువరాజు పొలంలో రెండు చిరుతలు జింకను వేటాడి చంపి తిన్నాయి. ఈ సమయంలో పక్క పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు వై.నాగిరెడ్డి, రామాంజినేయులు చిరుతలను చూసి భయంతో వణికిపోయారు. జనం పోగవడంతో చిరుతలు పక్కనే ఉన్న దానిమ్మ తోటలోకెళ్లాయి. విషయాన్ని రైతు నాగిరెడ్డి ఫారెస్ట్, పోలీసుశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కళ్యాణదుర్గం ఫారెస్ట్‌ సిబ్బందితో పాటు కణేకల్లు పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. చిరుతదాడిలో చనిపోయిన జింకను పరిశీలించారు. అనంతరం వెటర్నరి డాక్టర్‌ నాగబాబుతో పోస్టుమార్టం చేయించి కాల్చేశారు. ఓ చిరుత పెద్దగా మరో చిరుత చిన్నగా ఉండటంతో తల్లిబిడ్డలై ఉంటాయని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. చిరుతల కదలికలను రాత్రంతా గమనించి ఫారెస్ట్‌కు వెళ్లేదాకా డ్రైవ్‌ చేస్తామని ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసర్‌ రాంసింగ్‌ తెలిపారు.

రైతుల్లో భయం
రెండు చిరుతుల పొదాల్లో దాక్కోవడంతో రైతులు భయంతో వణికిపోతున్నారు. చిరుతలు సంచరించిన ప్రాంత చుట్టుపక్కల పొలాల్లోకి రైతులెవరూ బుధవారం వెళ్లలేదు. ఏక్షణంలో బయటికి వస్తాయోనని భయపడి రైతులు పొలాలకెళ్లకుండా ఉన్నారు. రాత్రి పూట అవి బయటికొచ్చే అవకాశముండటంతో ఏమార్గం నుండి అవి ఫారెస్ట్‌లోకి వెళ్తాయో అర్థంకాక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పెనకలపాడు గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించి ఓ వ్యక్తిని చంపిన ఘటనను మరవక ముందే చిరుతలు జన నివాసాల మధ్యకు రావడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

ఆందోళన చెందవద్దు
చిరుత సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రాంసింగ్, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీజర్‌ శ్రీపతినాయుడు తెలిపారు. రెండు లేదా మూడు రోజుల్లోగా చిరుతలు వాటి సొంత స్థలాలకు చేరుకొనే అవకాశముందని ఈలోపు రాత్రిపూట రైతులెవరూ పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే గుంపులు, గుంపులుగా వెళ్లాలన్నారు. ఇళ్ల బయట కూడా నిద్రపోవద్దన్నారు. చిరుతల సంచారంపై డీఎఫ్‌ఓకు సమాచారమిచ్చామని అవసరాన్ని బట్టి రెస్క్యూ టీమ్‌ను రంగంలో దింపుతామన్నారు.

రెండు గొర్రెలపై చిరుత దాడి
శింగనమల: మండలంలోని ఆనందరావుపేటలో పెద్దసుంకన్న గొర్రెల మందపై బుధవారం రాత్రి చిరుతపులి దాడి చేసిందని గొర్రెల పెంపకందారులు తెలిపారు. గొర్రెల మందపై దాడి చేసిన రెండు గొర్రెలను ఎత్తుకెళ్లి చంపేసిందన్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు మృతి చెందిన గొర్రెలను పరిశీలించి, వాటికి వెటర్నరీ వైద్యుడు నాయక్‌  ద్వారా పోస్ట్‌మార్టం చేయించారు.

చిరుత దాడిలో దూడ మృతి
శెట్టూరు: చిరుతపులి దాడిలో గేదె దూడ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చిన్నంపల్లిలో చోటు చేసుకుంది. బాధిత రైతు గంగాధర తెలిపిన వివరాల మేరకు... తనకున్న గేదెలను జడ్పీ హైస్కూల్‌ సమీపంలో ఉన్న తన గడ్డివాము వద్ద కట్టేసి వుంచాడు. గురువారం తెల్లవారుజామున చిరుతపులి గేదె దూడపై దాడి చేసిందన్నారు. దాడిలో మృతిచెందిన గెదే దూడను తినేసి మిగిలిన భాగాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిందన్నారు. ఉదయం గడ్డివాముకు వెళ్లిన బాధిత రైతు గంగాధర చిరుతదాడిలో మృతి చెందిన గేదెను గమనించి, ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చాడు. ఫారెస్టు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, గూడకు పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తలు