అప్పు కొండంత... పరిహారం గోరంత

14 Sep, 2015 03:09 IST|Sakshi
అప్పు కొండంత... పరిహారం గోరంత

- అప్పు తీరేదెలా...
- ప్రచారం తప్ప ఆదుకునే ఆలోచన లేని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఆత్మహత్య చేసుకున్న రైతుల అప్పులు కొండంత ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం గోరంత ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పొగాకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి, ఆదివారం ఉదయం మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాలని ఆదేశించడంతో వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో పర్యటించారు. పొగాకు రైతుల కుటుంబాలను కలిసి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే ఇది కొత్త ప్రకటనేంకాదు.

గతంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం వస్తుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంలో కూడా మూడున్నర లక్షల రూపాయలు కుటుంబసభ్యుల పేరిట డిపాజిట్ చేస్తామని, లక్షన్నర రూపాయలు మాత్రం అప్పులు తీర్చడానికి ఇస్తామని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అప్పులు పెద్ద మొత్తంలో ఉంటే లక్షన్నరతో అప్పులు ఎలా తీరుస్తామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
- టంగుటూరు మండలంలో ఆత్మహత్య చేసుకున్న బొల్లినేని కృష్ణారావు తనకున్న పొలం మూడు ఎకరాలు, ఒక బ్యారన్‌తోపాటు 17 ఎకరాలు, రెండు బ్యారన్లు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారు. చేతికి వచ్చిన పొగాకులో 40 క్వింటాళ్ల వరకూ మిగిలిపోవడం, మంచి ధర రాకపోవడంతో అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉమ్మడి కుటుంబాన్ని నడుపుతున్న కృష్ణారావు చనిపోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది.

కృష్ణరావుకు బయట ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీకి తీసుకువచ్చిన  అప్పులు 20 లక్షల రూపాయల వరకూ ఉండగా, బ్యాంకుల్లో బంగారం తాకట్టు రుణం 17.5 లక్షల వరకూ ఉంది. ప్రైవేటు అప్పులు ఎన్ని ఉన్నా ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే రూ.1.5 లక్షలతోనే తీరుస్తామని, అప్పుల వివరాలు ఆర్‌డీఓకు చెప్పమని మంత్రి కుటుంబ సభ్యులకు సూచించారు. 20 లక్షల రూపాయల అప్పును లక్షన్నరతో తీర్చడం సాధ్యమవుతుందా? బ్యాంకుల్లో ఉన్న రూ.17.5 లక్షల అప్పు, తాకట్టు పెట్టిన బంగారం సంగతి ఏంటని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు.  

- అదేవిధంగా వలేటివారిపాలెం మండలం కొండ సముద్రంలో ఆత్మహత్య చేసుకున్న నీలం వెంకటరావుకు ఏడు లక్షల రూపాయల వరకూ అప్పు ఉంది.  మూడు నెలల పిల్లవాడితో వెంకట్రావ్ భార్య  పరిస్థితి దయనీయంగా ఉంది. తమకు అప్పు తీర్చే స్థోమత లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.  

- ఇప్పటికే ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుని, ఇద్దరు రైతులు వేలం కేంద్రంలోనే గుండాగి చనిపోయినా పొగాకు బోర్డు అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్ వ్యాపారులకు కొమ్ముకాస్తూ చేసిన వ్యాఖ్యలే రైతులను ఆత్మహత్యలవైపు ఉసిగొల్పాయని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.

- రైతుల ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న పొగాకు బోర్డు గిట్టుబాటు ధరల కోసం ఆందోళన చెందుతున్న రైతుల వద్ద నుంచి పొగాకు కొనడానికి ముందుకు రాకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినా పొగాకు వ్యాపారులను ఒప్పిస్తారా అన్నది సందేహమే. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోల్‌సొసైటీ ద్వారా డబ్బులిచ్చి పొగాకు కొనుగోలు చేశారని, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. పొగాకు రైతులు మరింతమంది బలి దానం చేయకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు