పందేరం చేద్దాం!

8 Oct, 2014 02:48 IST|Sakshi

కార్పొరేషన్‌లో నామినేషన్ పనుల హడావుడి

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నగర కార్పొరేషన్‌లో నామినేటెడ్ పనుల పందేరానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో కేటాయింపులు ప్రారంభించనున్నారు. వార్డుల్లో ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల వరకు నామినేటెడ్ పనులను ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే కార్పొరేటర్లుగా గెలిచిన అభ్యర్థులకు ఈ పనులు ఇవ్వడం లేదని తెలిసింది. కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసి, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులకు మాత్రమే నామినేటెడ్ పనులను ఇవ్వనున్నట్లు తెలిసింది.

దీంతో ఎన్నికల్లో వారు పెట్టిన ఖర్చును కొంతవరకైనా సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుందని, తెలుగుదేశం అధిష్టానం సూచనల మేరకు మేయర్ అజీజ్, వారికి పనులను కట్టబెట్టనున్నట్లు తెలిసింది. అయితే మేయర్ ఎన్నికలు జరిగిన తర్వాత, జరగక ముందు టీడీపీలోకి వలస వెళ్లిన వారికి కూడా వారి వారి వార్డుల్లో పనులను అప్పగించనున్నట్లు తెలిసింది.

వీరు పార్టీ ఫిరాయింపు చేసినపుడు వారికి ఇస్తానన్న భారీ మొత్తానికి బదులుగా ఈ పనులను ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో కొంతమంది ఫిరాయింపుదారులు నిరుత్సాహానికి గురైనట్లు తెలిసింది. పార్టీ ఫిరాయిస్తే భారీ ఎత్తున డబ్బు ముట్టచెబుతామని టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలను నమ్మి, గెలిచిన పార్టీ నుంచి తెలుగు దేశంలోకి వచ్చామని, అయితే తమకు నామినేటెడ్ పనులు ఇచ్చి, సంపాదించుకోమనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అది కూడా ఒకొక్కరికి రూ.5లక్షల విలువగల పనులను ఇస్తున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా, గెలిచిన అభ్యర్థులు కూడా తమకు నామినేటెడ్ పనులను కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. తాము కూడా భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేసి గెలుపొందామని, తమకు కూడా నామినేటెడ్ పనులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వగా లేనిది, తమకు ఇస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన టీడీపీ కార్పొరేటర్ల సమావేశంలో మేయరు అబ్దుల్ అజీజ్ ఈ మేరకు ప్రకటించినట్లు తెలిసింది. అయితే దీనిపై పలువురు కార్పొరేటర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

తమ తమ వార్డుల్లో నామినేటెడ్ పనులను తమకే కేటాయించాలని, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వచ్చిన వారికి కేటాయిస్తే ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. కొంతమంది కార్పొరేటర్లు తమ నేతల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నార ని సమాచారం. మరికొంతమంది మంత్రి నారాయణ వద్దకు వెళ్లి తేల్చుకుంటామని కూడా అన్నారని తెలిసింది. దీంతో మేయరు కూడా వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కార్పొరేటర్లు తనకు సహకరించడం లేదని, నామినేటెడ్ పనులు కేటాయించకపోతే, తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు తనను ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని అంటున్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు