కంటెంట్, బోధన.. ఆన్‌లైన్‌లోనే

23 Mar, 2020 17:35 IST|Sakshi

కరోనా వైరస్‌ నేపథ్యంలో యూజీసీ కొత్త ప్రణాళికలు

31 వరకు అన్ని వర్సిటీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే పని విధానాన్ని ఈ నెల 31 వరకు అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఫ్యాకల్టీ మెంబర్లు, టీచర్లు, రీసెర్చి స్కాలర్లు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ కంటెంట్, ఆన్‌లైన్‌ బోధన, ఆన్‌లైన్‌ మూల్యాంకనం కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. (కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!)

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సందర్భంగా ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి.  
► వచ్చే విద్యా సంవత్సరం లేదా తదుపరి సెమిస్టర్‌లో అందించే కోర్సులకు పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి.
► బోధనా సామగ్రిని అభివృద్ధి పరచాలి.
► పరిశోధకులు ఇంటి నుంచే పరిశోధనలు కొనసాగించాలి.
► వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు, ఇతర మ్యాగజైన్‌లకు వ్యాసాలు, పేపర్లు మొదలైనవి ఇంటి నుంచే రాసి పంపించాలి.
► విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నలను సిద్ధం చేయాలి.
► ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌’ తదితర అంశాలపై వినూత్న ప్రాజెక్టులను సిద్ధం చేయాలి.
► ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తారు.
► హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యార్థులుంటే వారిని హాస్టళ్లలో కొనసాగడానికి అనుమతించాలి. వారికి అవసరమైన ఏర్పాట్లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి.
► ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బందిని సంప్రదించేందుకు మొబైల్‌ నంబర్లు, ఈ–మెయిల్‌ ఐడీ తదితర సమాచారాన్ని తమ సంస్థలకు పంపించాలి.  

మరిన్ని వార్తలు