ప్రజలకు అండగా ఉందాం

15 Jun, 2016 00:30 IST|Sakshi
ప్రజలకు అండగా ఉందాం

వైఎస్సార్ జయంతి రోజు నుంచి ‘గడప గడపకు వైఎస్సార్ సీపీ ’
ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటిని పలకరించాలి
చంద్రబాబు మోసాలు, వంచన చేసిన తీరును వివరించాలి  
పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ నూతనోత్తేజం నింపేలా ప్రసంగం
తొలుత గన్నవరంలో ఘనస్వాగతం పలికిన కృష్ణా, గుంటూరు నేతలు

 

విజయవాడ :  ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వారికి అండగా నిలవాలని, ప్రతి ఒక్క నేత ‘గడప గడపకు వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం కావాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న ‘గడప గడపకు వైఎస్సార్ సీపీ’ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ఆయన తెలిపారు. నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న మోసపూరిత హామీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను వంచించిన తీరును వివరించాలని విజ్ఞప్తి చేశారు.

 
పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం మంగళవారం విజయవాడలోని ఏ- కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సమావేశానికి తరలివచ్చారు. తొలుత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభను ప్రారంభించారు. ఆ తరువాత ప్రారంభోపన్యాసం, చివర  సుదీర్ఘంగా ముగింపు ప్రసంగం చేసి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 4.45 వరకు జరిగింది.

 
గన్నవరంలో స్వాగతం ...
హైదరాబాద్ నుంచి ఉదయం 8.45 గంటలకు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ రోడ్డు మార్గాన విజయవాడ నగరంలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.

 
రాష్ట్ర కమిటీ సమావేశం

తొలుత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి అధ్యక్షత వహించగా, అంశాల వారీగా పార్టీ నేతలు ప్రసంగించారు. సమావేశం ఉద్దేశం, పార్టీ లక్ష్యాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అనే అంశంపై పార్టీ జిల్లా ఇన్‌చార్జి, సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ప్రసంగించారు.

 
రెండేళ్ల ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు, ప్రత్యేక హోదాపై ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, రాజధాని భూ కుంభకోణంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, అవినీతిపై పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నదీ జలాలపై ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలుసు పార్థసారథి, వ్యవసాయ రంగంపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.

 

స్ఫూర్తి నింపిన వైఎస్ జగన్ ప్రసంగం
పార్టీ శ్రేణులను ఉద్దేశించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేస్తూ నూతనోత్తేజం నింపారు. పార్టీ ఆవిర్భావ లక్ష్యాలు మొదలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలిచి పోరు సాగిస్తున్న క్రమాన్నీ  వివరించారు. ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ’ కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. పార్టీ సమన్వయకర్తలు తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జూలై 8న ప్రారంభించి ఐదు నెలల పాటు నిర్వహించాలని తెలిపారు. అలాగే రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేస్తున్న చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. కార్యకర్తలకు అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

 

మరిన్ని వార్తలు