బిల్లుపై చర్చిద్దాం.. సహకరించండి: కురియన్

20 Feb, 2014 16:11 IST|Sakshi

తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో వివరంగా చర్చిద్దామని డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్ పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మధ్యాహ్నం మూడు గంటలకు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వెల్ వద్ద నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు సీమాంధ్ర ఎంపీలు, మరోవైపు తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు వెల్ వద్దకు చేరి తమ తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూనే ఉన్నారు.

పలుమార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి రాజ్యసభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. ఆ సమయంలో బిల్లుపై చర్చ జరగాలని నిర్ణయించామని, అందువల్ల దీనిపై చర్చకు సహకరించాలని సభ్యులకు కురియన్ విజ్ఞప్తి చేశారు. అటార్నీ జనరల్ను సభకు పిలిపించాలని సుజనా చౌదరి కోరారని, దాన్ని కూడా సవరణల గురించి చర్చకు వచ్చినప్పుడు పరిగణనలోకి తీసుకుందామని, అందువల్ల సభ్యులంతా తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరారు. కావాలంటే సభ్యులు బిల్లును వ్యతిరేకించవచ్చని, అది ప్రజాస్వామ్యంలో భాగమేనని ఆయన అన్నారు. అందువల్ల చర్చ సాగేందుకు అనుగుణంగా సభ్యులు సహకరిస్తే అన్ని సవరణల గురించి కూడా చర్చించవచ్చని తెలిపారు. ఈ గందరగోళం మధ్య వెంకయ్య నాయుడు తదితర సభ్యులు లేచి ఏదో మాట్లాడుతున్నా ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. వెల్ వద్ద నిల్చున్నవాళ్లకు సీనియర్లు నచ్చజెప్పి వెనక్కి తీసుకెళ్లాలని కూడా కురియన్ కోరారు. అయినా ప్రయోజనం ఏమీ కనపడలేదు. చర్చ జరుగుతుందని తాను హామీ ఇస్తానని, అందరూ స్థానాల్లోకి వెళ్లాలని కోరారు. చర్చ ప్రారంభం కాకముందే సవరణలను పరిగణనలోకి తీసుకోడానికి నిబంధనలు అంగీకరించవని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు