కలసికట్టుగా పనిచేద్దాం

3 Jul, 2014 03:30 IST|Sakshi
కలసికట్టుగా పనిచేద్దాం
  •   ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం
  •   అధికారులకు ఎమ్మెల్యే పిలుపు
  • తిరుచానూరు : ప్రజల అభివృద్ధి కోసం అందరం కలసికట్టుగా పనిచేద్దామని, రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో(ఎంపీడీవోలు మినహా) పరిచయ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శిల్పారామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్ధేశించి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు.
     
    ప్రజాప్రతినిధిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కసి, పట్టుదల తనలో ఉన్నాయన్నారు. ఆ సంకల్పంతోనే మంచి కార్యక్రమాలు, మేలైన కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు తాను ఎప్పటికీ ముందుంటానన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్రఅధికారులదేనన్నారు. అధికారులు-ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా, తుడా చైర్మన్‌గా, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎందరో ఐఏఎస్, ఇతర అధికారులతో కలిసి పనిచేశానన్నారు. తాను ఎప్పుడూ ఏ అధికారితోనూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయించలేదన్నారు.

    తుడా చైర్మన్‌గా దీర్ఘకాలంగా 3 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి తానేనని, పదవీకాలం ముగిసే రోజున ప్రజలు, అన్ని పార్టీల నాయకులతో పత్రికా ప్రతినిధుల సమక్షంలో ప్రజావేదిక ఏ ర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారులతో పనిచేయించుకోనని, అధికారులు సైతం ఏ వ్యక్తికో, రాజకీయ పార్టీకో తలొగ్గి పనిచేయకూడదని పిలుపునిచ్చారు. తన మాట కఠినంగా, వ్యవహారశైలి ఆవేశంగా ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా తాను కర్మసిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తినని, పాపభీతి కలిగిన వాడినని అన్నారు.

    తాను పల్లెలో పుట్టి పెరిగానని, పల్లె కష్టాలు తనకు తెలుసన్నారు. చదువుకునే సమయంలో మెటల్ రోడ్డులో కాలికి చెప్పులు లేకుండా కాలినడకన పాఠశాలకు వెళ్లిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు కష్టపడి చదవడంతోనే అధికారులైన మీరు, తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. పైరవీలతో తాను ఈస్థాయికి ఎదగలేదన్నారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని స్పష్టం చేశారు.

    ప్రస్తుతం గ్రామాలు అభివృద్ధి సాధించినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు అందరం కలసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన అధికారులు ఇదివరకు భాస్కర్‌రెడ్డి అంటే ఒకలా ఆలోచించామని, ఇప్పుడు మీతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజాభివృద్ధికి కలసి పనిచేస్తామని ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు.
     

మరిన్ని వార్తలు