ధైర్యం నింపాలి 

2 Apr, 2020 04:43 IST|Sakshi

వలస కూలీల క్యాంపుల్లో భోజనం, నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు కల్పించాలి

అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర వైద్య కుటుంబ శాఖ కార్యదర్శి లేఖ  

సాక్ష, అమరావతి: కోవిడ్‌–19 విపత్తు లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వలస కూలీల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ బుధవారం రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు.  

లేఖలో ఆమె ఇంకా ఏమన్నారంటే... 
► వలస వెళ్లిన ప్రదేశంలో చిక్కుకుపోయిన కూలీల కోసం అక్కడే సహాయ శిబిరాలను/ షెల్టర్‌ హోమ్స్‌ను ఏర్పాటు చేయాలి. ఆ శిబిరాల్లో వైద్య సదుపాయాలతో పాటు నాణ్యమైన భోజనం, రక్షిత మంచినీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలి. 
► శిబిరాల్లోని వలస కూలీలు మానసికంగా దృఢంగా ఉండేలా మనో వికాస సైకాలజిస్టులు, శిక్షణ పొందిన కౌన్సిలర్స్‌ ద్వారా ధైర్యం నింపాలి. వారిలో భయాలను తొలగించాలి. 
► రోజువారీ కష్టంతో పొట్ట నింపుకునే నిరుపేదలైన వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించక మానవీయ కోణంతో చూడాలన్నారు. 
► వలస కూలీల క్యాంపుల దగ్గర వలంటీర్లను ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళలు, పిల్లల పట్ల దయాగుణంతో వ్యవహరించాలి. 

వలస కూలీలను ఆదుకుంటాం
సీఎం జగన్‌ పిలుపునకు ఎంఎన్‌సీల అనూహ్య స్పందన
కరోనా కారణంగా ఉపాధి లేక అల్లాడుతున్న వలస కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపుతో బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) ముందుకొస్తున్నాయి. కరోనా వల్ల దాదాపు అన్ని రంగాలు స్తంభించిన వేళ ప్రభుత్వం ఆదుకుంటున్నా.. వలస కూలీలు సహాయ సహకారాలను ఆశిస్తున్నారని, వారికి సాయం అందేలా చూడాలన్న సీఎం ఆదేశాల మేరకు కనెక్ట్‌ టూ ఆంధ్రా సీఈవో వి.కోటేశ్వరమ్మ వివిధ కంపెనీలకు లేఖలు రాశారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, టాటా సన్స్‌ అండ్‌ ట్రస్ట్‌కు  లేఖలు పంపగా.. సాయం అందించేందుకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, అన్నవరం లలిత బ్రాండ్‌ రైస్‌ కంపెనీలు ముందుకు వచ్చినట్లు సీఈవో తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. బియ్యం, పంచదార, నూనె వంటి 15రకాల సరుకులున్న ఐదు వేల కిట్‌లు అందిస్తామని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌  ముందుకొచ్చింది.  డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సంస్థ  10 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు అందించేందుకు ముందుకొచ్చింది. అన్నవరం నుంచి లలితా బ్రాండ్‌ కంపెనీ 10 టన్నుల బియ్యాన్ని అందించనుంది.  ఒక్క గుంటూరు జిల్లాలోనే 17,655 వలస కుటుంబాలకు చెందిన 53,583 మంది వలస కూలీలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ రెండు రోజుల్లో  కిట్లను అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా