శహభాష్... సుబ్బాయమ్మ...!

14 Nov, 2014 01:28 IST|Sakshi
శహభాష్... సుబ్బాయమ్మ...!

ఎన్నెన్ని ప్రసవ వేదనలు, ఎన్నెన్ని ఆనందాలు, ఎన్నెన్ని సంతోషాలు, ఎన్నెన్ని నిరాశలు... 44 ఏళ్ల ప్రస్థానంలో సుబ్బాయమ్మ చూసిన విశేషాలెన్నెన్నో. ఇన్నేళ్లలో ఆమె వేలాది మంది శిశువులను  ప్రపంచానికి పరిచయం చేసింది. వేలాది మంది తల్లుల కన్నీరు తుడిచింది. వారి బాధలు పంచుకుంది. ఇప్పుడు ఎనభై నాలుగేళ్ల వయసులోనూ సేవే పరమార్థంగా గడుపుతోంది. ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయని సుబ్బాయమ్మ ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లకు గురువు. అమ్మగర్భం మరో బ్రహ్మలోకం అంటారు. ఆ లోకంలో ఉన్న పసిమొగ్గలను ఈ లోకంలోకి తెస్తూ... 44 ఏళ్లుగా సేవ చేస్తున్న సుబ్బాయమ్మ గురించి...
 
* జీవితంలో సంపాదించిందంతా అనాథాశ్రమానికిచ్చిన త్యాగమూర్తి...
* 84 ఏళ్ల వయసులో పదేళ్లుగా అనాథ పిల్లలకు సేవ చేస్తూ...తరిస్తున్న సేవామూర్తి...
* మా వైద్యులందరికీ గురవని కితాబిచ్చిన పట్టణ సీనియర్ వైద్యులు...
* ఆశ్రమం ధైర్యంగా నడుస్తోందంటే 84ఏళ్ల సుబ్బాయమ్మ అనుభవమే...నిర్వాహకులు...
* సుబ్బాయమ్మ త్యాగం...కావాలి మరికొందరికైనా స్ఫూర్తి...

పార్వతీపురం: ఆమె ఓ సాధారణ మాతృమూర్తి. కానీ 44 ఏళ్లు అసాధారణంగా సేవలు చేస్తున్నారు. అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ వైద్యాధికారులకు సైతం గురువుగా పేరు సంపాదించారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. నిలబడి పది మందికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు కూడా తన సంపాదనలో కొంత భాగాన్ని జట్టు ఆశ్రమానికి ఇచ్చి అనాథలకు సేవలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిగా... ఆశ్రమం నడిపే నిర్వాహకులకు పెద్ద దిక్కుగా తన 84 ఏళ్ల అనుభవాన్ని ఆమె ఇలా పంచుకున్నారు.
 
అమ్మా, నాన్నలే నాకు స్ఫూర్తి...
నా పేరు ఆదిమడపల సుబ్బాయమ్మ. మాది గుంటూరు జిల్లా బాపట్ల. మా నాన్న ముత్తిరెడ్డి రాఘవయ్య వ్యవసాయంతోపాటు రెండెడ్ల బండి తోలేవాడు. మా అమ్మ కనకమ్మ. మేము ఐదుగురు సంతానం. నాకు ఊహ తెలిసినప్పటి నుండే మా అమ్మా, నాన్నలు సంపాదించిన దానిలో కొంత సాటివారికి సహాయం చేసేవారు. మాది సాధారణ కుటుంబం అయినప్పటికీ మాకున్నంతలో తోటివారికి సహాయం చేసేవారు. అప్పటి నుంచే నాకు చేతనైనంత తోటివారికి సహాయం చేయడం అలవడింది. అప్పటి నుంచే  ఆనందం తెలిసింది.  
 
బాపట్ల నుంచి సాలూరుకు...
నా వివాహం తర్వాత బాపట్ల నుంచి సాలూరుకు వచ్చాం. తర్వాత పిల్లలతో పాటు 65 ఏళ్ల క్రితం పార్వతీపురం వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. నాకు ఇద్దరు పిల్లలు పాప, బాబు.  భర్త చనిపోయాక పిల్లల్ని పెంచే బాధ్యత నాపై పడింది. నాకు అక్షరం ముక్క రాదు. దీంతో ఓ పెద్దావిడకు తోడుగా పురుడు పోసేందుకు వెళ్లేదానిని. ఆమె వద్ద నాకు ఈ విద్య అబ్బింది. అప్పటి నుంచి అదే జీవనోపాధిగా మారింది. ఆ రోజుల్లో ఒక్కో పురుటికి రూ.50లు నుంచి *60లు ఇచ్చేవారు. కొంతమంది పేదవారు అది కూడా ఇవ్వలేకపోయేవారు. ఒక్కో రోజు 7 వరకు ప్రసవాలు చేసేదాన్ని. ఆ రోజుల్లో ఇం తగా ఆపరేషన్లు, వైద్య సదుపాయాలుండేవి కాదు. ఆస్పత్రుల్లోను, వీధులు, గ్రామాల్లోను ఇంటింటికి వెళ్లి ప్రసవాలు చేసేదాన్ని.
 
44 ఏళ్ల పాటు...
అలా మొదలైన నా జీవిత ప్రస్థానం 44 ఏళ్ల పాటు సాగింది. దీనిలో భాగంగా పురిటికి రూ.50 నుంచి 500లు పెరిగింది. దీంతో నేను సుమారు రూ.6లక్షలు వరకు సంపాదించాను. అప్పటికే పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో జట్టు వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడు అనాథాశ్రమాన్ని స్థాపించారు. టీచర్ ఉద్యోగం వదులుకొని ఆ రోజుల్లో అనాథపిల్లల కోసం పాటుపడుతున్న పారినాయుడు అంటే మనసులో ఎనలేని అభిమానం ఏర్పడింది. ఎలాగైనా నా వంతుగా సహాయం చేయాలనుకున్నాను. తొలుత రూ.20వేలు ఆశ్రమానికి విరాళమిచ్చాను.
 
అనాథ పిల్లలకు సేవ చేయాలనే...
అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్లి ఏదైనా పిల్లలకివ్వాలన్న కోరిక ఉండేది. ఓ మారు పిండి వంటలు చేసి పిల్లలకు తీసుకెళ్లాను. అప్పటికి ఉన్నత ఉద్యోగాలను విడిచిపెట్టి అనాథ పిల్లలకు సేవ చేసేందుకు వచ్చిన జట్టు నిర్వాహకురాలు వి.పద్మజను చూసిన నాకు...పిల్లలకు నేనెందుకు సేవ చేయకూడదనిపించింది. బాగా ఆలోచించి ఈ విషయాన్ని జట్టు వ్యవస్థాపకులు, నిర్వాహకులతో చెప్పాను. వారు ఆనందంగా స్వాగతించారు.
 
సంపాదనంతా జట్టు ఆశ్రమానికే...
అప్పటికే నా వద్ద ఉన్న సంపాదన రూ.2లక్షలు ఆశ్రమానికి చ్చి, పిల్లలకు సేవ చేస్తూ జీవితాన్ని ఎనలేని సంతృప్తితో గడుపుతున్నాను. తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిదండ్రినై, మలిదశలో ఆసరా లేని వృద్ధులకు తోడునై ఆశ్రమంలో ఆనందంగా గడుపుతున్నాను.
 
తల్లిదండ్రులను మరిపించే సేవలు ఆమె సొంతం...
ఇదిలా ఉండగా జట్టు ఆశ్రమంలో ఉన్న అనాథపిల్లలు, వృద్ధులకు సుబ్బాయమ్మ 84 ఏళ్ల వయసులో కూడా తల్లిదండ్రులను మరిపించే సేవలందిస్తోంది. వారి పెంపకంలో తన అనుభవాన్ని జత చేస్తూ జట్టు ఆశ్రమానికే పెద్ద దిక్కుగా నిలుస్తోంది.
 
వైద్యులందరికీ గురువు!
‘ఆమె చేయి చల్లదనం...నాడు వేలాది మంది గర్భిణులకు ధైర్యాన్నిచ్చింది. ఆమె పురుడు పోసేందుకు వచ్చిందంటే మరికొద్ది సేపులో పండంటి బిడ్డ తమ చేతికొస్తుందనే కొండంత ధైర్యం ఆ ఇంటివాళ్లకు కలిగేది. పురిటి నొప్పులు భరించలేని స్త్రీకి మరి కొద్ది సేపులో మాతృమూర్తి మాధుర్యాన్ని, అమ్మతనంలోని కమ్మదనాన్ని చవిచూస్తావంటూ ధైర్యాన్ని చెప్పి ఎంతమందికో గుండె      ధైర్యాన్నిచ్చిన సుబ్బాయమ్మను...పట్టణ సీనియర్ వైద్యులు సైతం మాకు గురువని మెచ్చుకుంటున్నారు.
 
సుబ్బాయమ్మ ఆశయం... కావాలి మరికొందరికైనా స్ఫూర్తి...
జీవితంలో పైసా పైసా కూడబెట్టి...సంపాదించినదంతా పిల్లలకు అప్పగించి మలి దశ లో ప్రశాంతంగా జీవించాలనేది ప్రతి వ్యక్తి సాధారణమైనఆశ. కాని సుబ్బాయమ్మ మాత్రం తన పిల్లల జీవితాలను స్థిరపరచి, వారి అనుమతితో స్థానిక జట్టు ఆశ్రమంలో ఆనాథ పిల్లలకు సేవలందిస్తూ...తన జీవితాశయాన్ని నెరవేర్చుకుంటున్న  ఆదిమడపల సుబ్బాయమ్మ మరికొందరికైనా స్ఫూర్తి కావాలి.

మరిన్ని వార్తలు