ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని

1 Nov, 2018 13:55 IST|Sakshi
తమకు ప్రాణహాని ఉందని చెబుతున్న టీడీపీ కౌన్సిలర్‌ చిన్నలక్ష్మి

జీ+3 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు అంతమొందించే కుట్ర

9వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ చిన్న లక్ష్మి ఆందోళన

గందరగోళంగా మున్సిపల్‌ సమావేశం

ఎమ్మిగనూరు: ‘జీ+3 ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి, కౌన్సిలర్‌ సుందర్‌ రాజుల నుంచి తన భర్త ప్రభాకర్, తనకు ప్రాణహాని ఉందని టీడీపీ 9వ వార్డు కౌన్సిలర్‌ చిన్నలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు.  కొంతకాలంగా అగంతకులు ఫోన్‌చేసి బెదిరిస్తూ, తన భర్తను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని’  ఆందోళన వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ సాయసరస్వతి అధ్యక్షతన బుధవారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే దళిత కౌన్సిలర్‌ చిన్నలక్ష్మి మాట్లాడుతూ దళిత వార్డుల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతి,  జీ+3 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను తన భర్త ప్రభాకర్‌ సోషల్‌ మీడియా, మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారన్నారు. దీనిని జీర్ణించుకోలేక  ఎమ్మెల్యే సహకారంతో కౌన్సిలర్‌ సుందర్‌రాజు తమను అంతం చేసేందుకు కుట్ర పన్నారని  ఆరోపించారు. 

వారిద్దరి నుంచి తమకు రక్షణ కల్పించాలని  వేడుకుంది. తమకు ఏదైనా హాని జరిగితే అందుకు ఎమ్మెల్యేనే కారణమంటూ సమావేశం దృష్టికి తెచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌ బుట్టారంగయ్య మాట్లాడుతూ జీ+3 ఇళ్ల  మంజూరు పేరుతో అధికారపార్టీ కౌన్సిలర్‌లు, టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సాక్షాత్తు  ఆ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌ చిన్నలక్ష్మి కూడా   ప్రస్తావించిందన్నారు.  ఎమ్మిగనూరు జీ+3 ఇళ్లు ఎన్ని మంజూరయ్యాయి, ఎంతమంది దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో..మళ్లీ కొత్తగా జాబితాలు పట్టుకుని అక్రమ వసూళ్లు ఎందుకు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా చంద్రన్న పెళ్లికానుకలు ఇప్పించాలంటే  రూ.3వేలు, పొదుపు రుణాల మంజూరుకు ఒక్కో  గ్రూపు నుంచి  రూ.15వేలు చొప్పున కౌన్సిలర్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు స్త్రీనిధి నిధులను సైతం వారు మింగేస్తున్నారని చెప్పడంతో టీడీపీ కౌన్సిలర్లు సభలో  గందరగోళం సృష్టించారు.

అనంతరం 1వ వార్డు కౌన్సిలర్‌ నాగేశప్ప మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో మట్టిమిద్దెలుగా ఉన్నవాటిని ఆర్సీ బిల్డింగులుగా చూపుతూ అధిక పన్నులు వేశారన్నారు. బుట్టారంగయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  తెల్లకార్డున్న పేదలందరికీ రూ.200కే కుళాయి కనెక్షన్‌ ఇస్తే టీడీపీ ప్రభుత్వం నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.  కౌన్సిలర్‌ సుందర్‌రాజు మాట్లాడుతూ 9వ వార్డు కౌన్సిలర్‌ చిన్నలక్ష్మి భర్త ప్రభాకర్‌ నుంచే ఎమ్మెల్యేకు, తనకు ప్రాణహాని ఉందని చెప్పగానే సభలోని సభ్యులంతా నవ్వుకున్నారు. అనంతరం అజెండా అంశాలను చదవకుండానే ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు.  సమావేశంలో కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి, డీఈలు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్‌లు షబ్బీర్, రిజ్వానబేగం, దివ్యకళ, శివశంకర్, సలాం, భాస్కర్‌రెడ్డి, విజయలక్ష్మి, వీజీ ఉష, ఈరమ్మ, లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు