రాత్రి విమానాలకు లైన్‌ క్లియర్‌ 

4 Jul, 2020 10:01 IST|Sakshi

కడప కార్పొరేషన్‌: కడప విమానాశ్రయంలో రాత్రి వేళ విమానాలు రాత్రి దిగేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇందుకు సంబంధించి లైట్ల ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కడప విమానాశ్రయంలో రాత్రి వేళలో విమానాలు దిగడానికి ఉన్న అనుకూలతలను పరిశీలించాలని కడప పార్లమెంటు సభ్యులు ఎయిర్‌ పోర్టు అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సూచించారు. 2019 అక్టోబర్‌ 18వ తేదిన నిర్వహించిన ఏఏసీ మీటింగ్‌లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సభ్యుల ముందు ఉంచారు. రాత్రి వేళలో విమానాలు దిగాలంటే పైలెట్లు గుర్తించడానికి కొండల పైభాగంలో అబ్‌స్టాకిల్‌ లైట్లు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఇందుకు అటవీ శాఖ అనుమతులు అవసరమని తీర్మానించి కేంద్రానికి పంపారు. ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సర్వే బృందం సూచించిన నాలుగు ప్రాంతాల్లో ఈ అబ్‌స్టాకిల్‌ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో  రెండు ప్రాంతాలు  కడప ఫారెస్ట్‌ డివిజన్‌లోని శ్రీ లంక మల్లేశ్వర అభయారణ్యంలో, మరో రెండు ప్రొద్దుటూరు ఫారెస్ట్‌ డివిజన్‌లోని నాగార్జున సాగర్‌– శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటికి అనుమతిలిస్తూ నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.  

అప్రోచ్‌ భాగం పూర్తి
కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి కృషి వల్లే అబ్‌స్టాకిల్‌ లైటింగ్‌కు అటవీ శాఖ అనుమతులు ఇచ్చిందని ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ పి. శివప్రసాద్‌ తెలిపారు. సాధారణంగా ఇలాంటి వాటికి అటవీ శాఖ అనుమతులు రావడం చాలా కష్టమని చెప్పారు. ఎయిర్‌ పోర్టు అడ్వయిజరీ కమిటీ సమావేశానంతరం ఎంపీ పలుసార్లు ఢిల్లీలో అటవీ శాఖ అధికారులను కలిసి అనుమతులు వచ్చేలా చేశారన్నారు. ఎయిర్‌ పోర్టులో ప్రస్తుతం అప్రోచ్‌ పార్ట్‌ పనులు పూర్తయ్యాయని, పారామీటర్, రన్‌ పనులు వేగంగా పూర్తవుతాయన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే నైట్‌ ల్యాండింగ్‌ సులభతరమవుతుందని తెలిపారు.   

మరిన్ని వార్తలు