విద్యుదాఘాతంతో హెల్పర్ మృత్యువాత

17 Aug, 2013 00:53 IST|Sakshi
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: తెగిపడిన విద్యుత్ తీగను సరిచేస్తుండగా విద్యుత్ ప్రసారం అవడంతో ఓ హెల్పర్‌కు విద్యుదాఘాతమై మృత్యువాత పడ్డాడు. లైన్‌మన్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుర్కపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తుమ్మ దాసు అలియాబాద్ సబ్‌స్టేషన్ పరిధిలోని (42) తుర్కపల్లిలో పదహారేళ్లుగా హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మి, కూతురు మాధవి, కుమారుడు మహేష్ ఉన్నారు. శుక్రవారం తుర్కపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డు అవతల ఉన్న 11కేవీ విద్యుత్ తీగ తెగిపడింది.  దాసు ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకుని పోల్ వద్ద మరమ్మతు చేస్తున్నాడు. రెండు తీగలను కలుపుతుండగా కరెంట్ సరఫరా అయింది. దీంతో స్తంభంపై ఉన్న దాసుకు విద్యుదాఘాతమై కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే దాసు మృతిచెం దినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా చేశారు.
 
 బంధువుల ఆందోళన..
 సబ్‌స్టేషన్ నుంచి దాసు ఎల్‌సీ తీసుకున్నా లైన్‌మన్ విద్యుత్ ప్రసారం చేయడం ఏమిటని మృతుడి బంధువులు మండిపడ్డారు. లైన్‌మన్ గణపతి నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైందని సంఘటనా స్థలంలో మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు గంటసేపు ఉద్రిక్తత నెలకొంది. శామీర్‌పేట్ సీఐ కాశిరెడ్డి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
 మిన్నంటిన రోదనలు 
 కుటుంబానికి పెద్దదిక్కు అయిన దాసు మృతితో భార్యాపిల్లలు గుండెలుబాదుకున్నారు. ‘మాకు దిక్కెవరు...?’ అని వారు రోదించిన తీరు హృదయ విదారకం. దాసు మృతితో తుర్కపల్లిలో విషాదం అలుముకుంది.
మరిన్ని వార్తలు