‘లింగమనేని’కి భూ విందు

28 Jun, 2019 10:21 IST|Sakshi
డొంక దారిని మూసివేసి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసిన లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ

జాతీయ రహదారి పక్కన డొంక రోడ్డును ధారాదత్తం చేసిన ‘ఉడా’ అధికారులు

2.15 ఎకరాల భూమి రూ.15 లక్షలకే అప్పగింత, ఇప్పుడు ఆ స్థలం విలువ రూ.30 కోట్లు

రోడ్డును మూసేసి ప్రహరీ నిర్మాణం చేపట్టిన లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ  

సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా, నిడమర్రు, చినకాకాని.. పెదకాకాని మండలం నంబూరు.. తాడికొండ మండలం కంతేరు గ్రామాల మధ్యలో జాతీయ రహదారి పక్కనే ఉన్న డొంక రోడ్డును విజయవాడకు చెందిన లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అప్పనంగా కొట్టేసింది. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఈ రహదారిని మూసివేసి, ప్రహరీ నిర్మాణం చేపట్టింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఏసీసీ యాజమాన్యం కింద విలువైన భూములు ఉండేవి. 2004 సంవత్సరానికి ముందే ఈ భూములు తొలుత ప్రభుత్వానికి చెందిన ‘ఉడా’కు, తర్వాత లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పరమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వివిధ సర్వే నంబర్లలో 146.68 ఎకరాల భూములుండగా, వాటిలో 115.91 ఎకరాలను ‘ఉడా’ కొనుగోలు చేసి, లింగమనేని సంస్థకు విక్రయించింది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కోసం నిబంధనలకు విరుద్ధంగా డొంకదారిని కూడా విక్రయించడం గమనార్హం.

నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 143 సర్వే నంబర్‌లో దాదాపు కిలోమీటర్‌ పొడవున, 40 అడుగుల వెడల్పుతో ఈ రహదారి ఉంది. కంతేరు, నంబూరు గ్రామాల పొలిమేరల్లో ఉన్న ఈ డొంకరోడ్డును గతంలో రైతులు ఉపయోగించుకునేవారు. ఈ డొంకరోడ్డు విస్తీర్ణం 2.15 ఎకరాలు కాగా, 2004కు ముందు ఉడా అధికారులు లింగమనేని రియల్‌ ఎస్టేట్‌కు కేవలం రూ.15 లక్షలకే విక్రయించారు. లింగమనేని సంస్థ కొనుగోలు చేసిన 115.61 ఎకరాలతోపాటు 2.15 ఎకరాల డొంకరోడ్డు భూమిలో లేఔట్‌ వేసేందుకు ఉడా అనుమతులు ఇచ్చేసింది. దాంతో డొంక రోడ్డు చుట్టూ లింగమనేని కంపెనీ ప్రహరీ నిర్మించింది. ‘ఉడా’ ఎంతో ఉదారంగా రూ.15 లక్షలకు విక్రయించిన 2.15 ఎకరాల భూమి విలువ ఇప్పుడు అక్షరాలా రూ.30 కోట్లకు చేరడం గమనార్హం. డొంక దారి విక్రయంపై స్థానికులు కోర్టుకు వెళ్లడంతో పాటు లోకాయుక్తను సైతం ఆశ్రయించారు. డొంకదారి విక్రయంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆ రహదారిని లింగమనేని చెర నుంచి విడిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు