స్పష్టత లేకుండా భూములివ్వం

14 Nov, 2014 02:02 IST|Sakshi

* లింగాయపాలెంలో టీడీపీ నేతల్ని నిలదీసిన రైతులు
* రాజధాని ఎక్కడ? ఎలా? ఏం నిర్మిస్తారు?
* ఎంత భూమి? ఎలాంటి ది కావాలి?
* తుళ్లూరు మండలంలోనే ఎందుకు?
* మెట్ట భూముల్ని వదిలి ఏడాదికి 3 పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటున్నారు?
* కౌలు రైతులు, రైతు కూలీలకు ప్యాకేజీలేవీ?
* ల్యాండ్ పూలింగ్ ఎలా నమ్మాలి?
* చట్టబద్ధమైన జీవోలతో రావాలని డిమాండ్

తుళ్లూరు: ప్రభుత్వానికే స్పష్టత లేకుంటే రైతులనుంచి రాజధానికోసం భూములు ఎలా తీసుకుంటారని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీశారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ నేతృత్వంలోని మంత్రివర్గ ప్రతినిధి కమిటీ గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా లింగాయపాలెంలో రైతులు తమ అభిప్రాయాలను కమిటీ ముందు ఉంచారు.

రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ... రాజధాని ఎక్కడ నిర్మిస్తారు? ఎలా నిర్మిస్తారు? ఏమేం నిర్మిస్తారు? వాటికి ఎంత భూమి కావాలి? ఎలాంటి భూమి కావాలి? తుళ్ళూరు మండలంలోనే ఎందుకు రాజధాని నిర్మించే ప్రతిపాదనలు చేస్తున్నారు? ఆనే ప్రశ్నల వర్షం గుప్పించారు. ఓవైపు అధికారులను, రైతులను, ల్యాండ్ పూలింగ్‌కు సన్నద్ధం చేస్తూ మరోవైపు రాజధాని నిర్మాణం కోసం నమూనాలు పరిశీలించేందుకు సీఎం సింగపూర్, మలేసియా పర్యటనలు చేస్తున్నారంటే ఇంతవరకు ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదనే విషయం అర్థమవుతోందన్నారు. చట్టబద్ధతలేని ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వ్యవసాయకూలీలకు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్యాకేజీలు కానీ, ప్రతిపాదనలు గానీ చేయలేదని ఆక్షేపించారు. చట్టబద్ధమైన జీవోలతో రైతుల వద్దకు రావాలని డిమాండ్ చేశారు.

మరో రైతు మాదల భువనేశ్వరరావు మాట్లాడుతూ మెట్టప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వుంటే ఏడాది మూడు పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. కౌలు రైతు మోతుకూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సభకు వచ్చిన 500 మందిలో 50 మందికి మాత్రమే భూములు వున్నాయని మిగిలినవారంతా వ్యవసాయ కూలీలని చెప్పారు. ఈ భూములు లేకుంటే వారు ఏమైపోవాలని ప్రశ్నించారు.

అనంతరం ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రైతుల అభిప్రాయాలు సీఎంకు వివరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 18, 19 తేదీలలో రైతులతో సమావేశ పరుస్తామని  నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

అనంతరం వెలగపూడిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా సూరాయపాలెం, గొల్లపూడి మధ్య నుంచి తుళ్లూరు మండలంలోని వెంకటపాలెం వరకూ వేగంగా వంతెన నిర్మిస్తామని తెలిపారు. రూ.20 వేల కోట్లతో బందరు పోర్టును అభివృద్ధి చేయడంతో పాటు కంటైనర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు