జాతీయ రహదారిపై మళ్లీ మద్యం

31 Oct, 2017 15:39 IST|Sakshi

సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చిందని ఏర్పాట్లు ముమ్మరం 

ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన తీర్పును ఇక్కడ అమలు చేసేస్తున్న వ్యాపారులు  

జిల్లాలో ఇప్పటి వరకు 25 దుకాణాలు ఏర్పాటు

 చోద్యం చూస్తున్న అధికారులు

సాక్షి, రాజమహేంద్రవరం:  జాతీయ రహదారులపై మళ్లీ మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. నగర, పురపాలక సంస్థల పరి«ధిలో నుంచి వెళుతున్న జాతీయ రహదాలపై మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తరాది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని మన రాష్ట్రంలో కూడా దుకాణాలు ఏర్పాటు చేసేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జాతీయ రహదారులు అధిక శాతం నగరాల మధ్య నుంచి వెళుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో జాతీయ రహదారులకు 500 మీటర్లు, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన సుప్రీం ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే పలు కారణాల వల్ల ఆ గడువును మార్చి నెలాఖరుకు, ఆ తర్వాత జూన్‌ వరకు పొడిగించింది. రాష్ట్రంలో మద్యం నూతన పాలసీ జూలైలో ప్రారంభం కావడంతో అప్పటి నుంచి ఆ తీర్పును అమలు చేశారు. మద్యం వల్ల వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆ«ధీనంలో ఉన్న రాష్ట్ర రహదారులను నగరపాలక, పురపాలక, మండల కేంద్రాల పరిధి వరకు జిల్లా ప్రధాన రహదారులుగా మార్చివేసింది. తాజాగా ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన వెలుసుబాటును ఉపయోగించుకుని జాతీయ రహదారుల పక్కన కూడా మద్యం దుకాణాల ఏర్పాటు చేసుకోడానికి వ్యాపారులకు అనుమతిస్తోంది. 

ప్రాణాలు పోతే మాకేంటి..?
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గత మద్యం పాలసీలో 545 దుకాణాలకుగాను 499 దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారులపై 379 దుకాణాలున్నాయి. జాతీయ రహదారులపై 39 ఉండగా మిగిలిన 340 దుకాణాలు రాష్ట్ర రహదారులపై ఉన్నాయి. సుప్రీం తీర్పుతో ఈ దుకాణాలను రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే దుకాణాలు ఏర్పాటు చేసే పట్టణాల్లో రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయడంతో ఎప్పటిలాగే 340 దుకాణాలు యథాతథంగా ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు