85 మున్సిపాల్టీల్లో ఓటర్ల జాబితా వెల్లడి

11 May, 2019 03:45 IST|Sakshi

కొలిక్కివచ్చిన మున్సిపల్‌ ఎన్నికల తొలిఘట్టం

కోర్టు కేసులు, వార్డుల పునర్విభజన పూర్తికానందున16 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వెల్లడి కాని జాబితా 

తొమ్మిది కార్పొరేషన్లలో వార్డుల వారీగా జాబితా రెడీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన తొలి ఘట్టం ఒక కొలిక్కి వచ్చింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు శుక్రవారం 85 మున్సిపాల్టీల్లో ఫొటో ఓటర్ల జాబితాను ప్రకటించారు. నిజానికి ఏప్రిల్‌ నెలాఖరులోపే వీటిని ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల కారణంగా అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించలేకపోయారు. ఈ కారణంతో ప్రభుత్వం ఈ నెల 10 వరకు ఓటర్ల జాబితా వెల్లడికి గడువిచ్చింది. దీంతో అన్ని మున్సిపాల్టీల్లో ప్రత్యేక ఎన్నికల విభాగాన్ని ఏర్పాటుచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకుగాను 85 మున్సిపాల్టీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించారు.

రెండు మున్సిపాల్టీల్లో కోర్టు కేసులు, 14 మున్సిపాల్టీల్లో చుట్టుపక్కల గ్రామాల విలీనం కాకపోవడంవల్ల వార్డుల పునర్విభజన జరగలేదు. దీంతో జాబితాను వెల్లడించలేదు. వీటిలో శ్రీకాకుళం జిల్లా రాజాం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాల్టీలపై కోర్టులో కేసులు ఉన్నాయి. వార్డుల పునర్విభజన జరగకపోవడం కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, గుంటూరు జిల్లా వినుకొండ, తాడేపల్లి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా నాయుడుపేట, కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాల్టీల్లో ఓటర్ల జాబితాను వెల్లడించలేదు. అయితే, విజయనగరం, గ్రేటర్‌ విశాఖ, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప కార్పొరేషన్‌ల్లో వార్డుల పునర్విభజన, కాకినాడలో పాలకవర్గం కొనసాగుతుండటంతో ఓటర్ల జాబితాను వెల్లడించలేదు. కాగా, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు కార్పొరేషన్లలో డివిజన్ల వారీ ఫొటో ఓటర్ల జాబితాను ప్రకటించారు. 

మరిన్ని వార్తలు