అన్నింటా తామేనంటూ.. అందనంత దూరంగా..

17 Aug, 2019 10:41 IST|Sakshi

కు.ని. శస్త్ర చికిత్సకు పురుషులు వెనుకడుగు

ఐదేళ్లలో 1,23,907 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు

సాక్షి, గుంటూరు: దేనికైనా సరే.. మేము రెడీ అనే మగాళ్లు కుటుంబ నియంత్రణ కోసం చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు మాత్రం దూరం... దూరం అంటున్నారు. అన్నింటా తామేనంటూ ఆధిపత్యం చాటుకునే మగ మహారాజులు కు.ని. ఆపరేషన్‌ దగ్గరికి వచ్చే సరికి ‘వేసెక్టమా.. వామ్మో’ అంటూ తప్పించుకుంటున్నారు. జనాభా నియంత్రణలో కీలకంగా ఉండే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో వెనుకడుగు వేస్తున్నారు.  

శస్త్రచికిత్సల కోసం పురుషులకు ఎంతో సులువైన పద్ధతులు వచ్చినా వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో జరిగిన ఆపరేషన్ల గణాంకాలే అందుకు నిదర్శనం. జిల్లాలో ఐదేళ్లలో  1,23,907 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. వీటిల్లో మహిళలు 1,23,713 మంది ఆపరేషన్లు చేయించుకోగా పురుషులు కేవలం 194 మంది మాత్రమే కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఏడాది మొత్తంలో ఆపరేషన్లు చేయించుకుంటున్న పురుషులు కనీసం 50 మంది కూడా ఉండటం లేదు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా వేసెక్టమీ ఆపరేషన్ల విషయంలో మగవారికి అవగాహన కల్పించే విషయంలో అధికార యంత్రాంగం సరైన చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

సిజేరియన్‌తో కలిపి చేస్తున్నారు.. 
నేడు చాలా మంది సంతానం విషయంలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు. కాన్పు కోసం వెళ్లిన సమయంలో ఇక పిల్లలు వద్దను కోగానే  సిజేరియన్‌ చేసి దాంతో పాటుగా కు.ని. ఆపరేషన్‌ చేస్తున్నారు. ఎక్కువ మంది వైద్యులు సాధారణ కాన్పుల కోసం వేచి చూడకుండా సిజేరియన్‌ డెలివరీలు చేస్తుండటంతో పనిలో పనిగా ఆడవారికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. కొంత మంది సాధారణ కాన్పు జరిగినా కూడా మహిళలనే కు.ని. ఆపరేషన్లు చేయించుకోమని చెబుతున్నారే తప్పా పురుషులు చేయించుకోవడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు.

ఆడవారి పని అనే ధోరణి.. 
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారే చేయించుకోవాలనే భావన నేటి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతోంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సంపాదనలో మగవారితో పోటీ పడుతున్నారు. ఇంటి ఎదుగుదలకు తమవంతు కృషి చేస్తున్నారు. అక్కడ మహిళను గొప్పగా చూసే మగవారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల దగ్గరికి వచ్చే సరికి అది వాళ్ల బాధ్యతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మగవారికి చేసే శస్త్రచికిత్సలు సులువుగా ఉంటాయని తెలిసినా ఎవరూ ముందుకు రావడం లేదని వైద్యులు అంటున్నారు. చదువుకున్న పురుషులు సైతం వేసెక్టమీ శస్త్రచికిత్స కోసం ఆసక్తి చూపించడం లేదు. మగవారు కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకుంటే రకరకాల సమస్యలు వస్తాయనే మూఢత్వం ఇంకా జనాల్లో పేరుకుపోయి ఉంది. ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు లేకపోలేదు.

వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులభం
కుటుంబ నియంత్రణ కోసం మహిళలు చేయించుకునే ట్యూబెక్టమీ శస్త్రచికిత్స కంటే పురుషులు చేయించుకునే వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులువుగా చేయవచ్చు. కేవలం మూడు నుంచి ఐదు నిమిషాల వ్యవధిలో ఆపరేషన్‌ చేస్తారు. కు.ని. శస్త్రచికిత్స చేయించుకునే పురుషులు కేవలం ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవాలి. స్త్రీలు ఆపరేషన్‌ చేయించుకుంటే వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి. పురుషులు వారం రోజులు బరువులు ఎత్తకూడదు. వారం రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఎలాంటి  భయాలు లేకుండా పురుషులు వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం కు.ని. ఆపరేషన్‌ చేయించుకునే స్త్రీలకు రూ.600లు, పురుషులకు రూ. 1,100 పారితోషికంగా ఇస్తోంది.   
– డాక్టర్‌ మండవ శ్రీనివాసరావు, మెడికల్‌ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్‌ 

మరిన్ని వార్తలు