విర్డ్‌లో ఆధునిక కీళ్ల చికిత్స

27 Aug, 2018 13:32 IST|Sakshi
శస్త్రచికిత్స చేస్తున్న ప్రముఖ వైద్యుడు జగదీష్‌

ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జగదీష్‌ వెల్లడి

విర్డ్‌లో నిర్వహించిన లైవ్‌ శస్త్రచికిత్సలు

పాల్గొన్న 5 రాష్ట్రాలకు చెందిన 106 మంది వైద్యులు

ఆధునిక కీళ్ల చికిత్సా విధానం లింబ్‌ ప్లిజర్‌వేషన్‌ సిస్టం ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్‌ ఆస్పత్రిలోఅందుబాటులోకి వచ్చింది. అమెరికాకే పరిమితమైన ఈ విధానంపై ఆదివారం వైద్యులకు లైవ్‌ శస్త్రచికిత్స ద్వారా    అవగాహన కల్పించారు.

పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: ఇటలీలో పుట్టిన లింబ్‌ ప్లిజర్‌వేషన్‌ సిస్టమ్, ప్రస్తుతం అమెరికా వైద్యుల చేతులో ఉందని, ఆ వైద్యాన్ని తాము విర్డ్‌ ఆసుపత్రిలో చేస్తున్నట్టు ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్, తిరుమల తిరుపతి బర్డ్‌ ఆసుపత్రి ప్రధాన వైద్యులు జగదీష్‌ తెలిపారు. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్‌ ఆసుపత్రిలో ఆదివారం లైవ్‌ శస్త్ర చికిత్సలను నిర్వహించారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వైద్యులే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు, అసిస్టెంట్‌ సర్జన్లు 106 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగదీష్‌ ఆపరేషన్‌ చేసే విధానాన్ని ప్రొజెక్టర్‌ ద్వారా లైవ్‌లో వైద్యులకు వివరించారు. వైద్యులకు కలిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. విర్డ్‌ ఆసుపత్రిలో చేస్తున్న శస్త్రచికిత్సలకు వినియోగిస్తున్న అధునాతన, నాణ్యమైన పరికరాల గురించి ఆయన వైద్యులకు వివరించారు. అనంతరం డాక్టర్‌ జగదీష్, విర్డ్‌ ఆసుపత్రి ట్రస్ట్‌ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, వైస్‌ చైర్మన్, రాజు వేగేశ్న ఫౌండేషన్‌ అధినేత ఆనందరాజు, సభ్యులు చెలికాని రాజబాబు, గుప్తా, ఆడిటర్‌ సాయి, వెంపరాల నారాయణమూర్తి, సుధాకరరావులు గత శిబిరంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా కాలిపర్స్‌లను అందజేశారు. డాక్టర్‌ జగదీష్‌ మాట్లాడుతూ లింబ్‌ ఎముక ఏర్పడేందుకు ప్లిజర్‌వేషన్‌ సిస్టమ్‌ చికిత్సను ఏడాదిన్నర పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో మాత్రమే చేస్తున్న ఈ చికిత్సను విర్డ్‌ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఎలాంటి శస్త్రచికిత్స అయినా సరే..
ఆర్థోపెడిక్‌ విభాగంలో ఎలాంటి శస్త్రచికిత్సనైనా విర్డ్‌ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్టు జగదీష్‌ తెలిపారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆర్థోపెడిక్‌ ఆసుపత్రి తిరుమల తిరుపతి బర్డ్‌ అయితే, అవే తరహా వసతులతో సేవలందిస్తున్న ఆసుపత్రి ఇక్కడి విర్డ్‌ అన్నారు. కీళ్ల మార్పిడి, వెన్నెముక, మోకాళ్ల శస్త్ర చికిత్సలతోపాటు, పొట్టిగా ఉన్న వారిని పొడవుగా చేసే చికిత్సలు కూడా చేస్తున్నట్టు చెప్పారు.
చైర్మన్‌ సుధాకరరావు మాట్లాడుతూ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే వంద పడకల ఆసుపత్రిగా విర్డ్‌ అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 15 వేల మంది పోలియో వికలాంగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, అందులో అవసరమైన వారికి కాలిపర్స్‌లను అందించామన్నారు. రోజు రోజుకు విర్డ్‌ సేవలు విస్తరిస్తున్నాయని చైర్మన్‌ అన్నారు.  కార్యక్రమంలో పెనుమత్స నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు