అయ్యో...ఆయేషా..!

5 Aug, 2018 12:18 IST|Sakshi

చిన్ని వయసులోనే పెద్ద వ్యాధితో సతమతం

ఉన్నట్టుండి కోమాలోకి వెళ్తున్న వైనం

కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదంటున్న వైద్యులు

ఏం చేయాలో తెలియక  కుమిలిపోతున్న తల్లిదండ్రులు

కడప కార్పొరేషన్‌: ముద్దులొలికే ఈ చిన్నారి పాప పేరు ఆయేషా(8). కడప నగరం రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన హుస్సేన్‌ఖాన్, షాహీనా దంపతుల పెద్ద కుమార్తె.  జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న చర్చి స్కూల్‌లో 3వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది మే మాసంలో ఆ పాపకు ఉన్నట్టుండి జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌లో చూపించగా కామెర్లు అని వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గినప్పటికీ కడుపు, కాళ్లు వాపులు ఎక్కువ కావడంతో బెంగళూరులోని ఇందిరా గాంధీ హాస్పిటల్, మధురైలోని వేలమ్మాల్‌ ఆసుపత్రి, చెన్నైలోని ఐసీహెచ్‌ అండ్‌ హెచ్‌సీ హాస్పిటల్‌లో వైద్యం చేయించారు. ఇందుకోసం రూ.2లక్షల వరకూ ఖర్చు చేసుకున్నారు. కాలేయంలో కాఫర్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆయేషాకు తీవ్రమైన సమస్య  ఏర్పడిందని, దీనికి కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని వైద్యులు తేల్చిచెప్పారు. ఇందుకోసం సుమారు రూ.40లక్షలు ఖర్చు చేయాల్సి ఉండటంతో రెక్కాడితేగానీ డొక్కాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా తెచ్చుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. 

 ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉండే ఆయేషాను బాత్‌రూమ్‌కు కూడా తల్లిదండ్రులే ఎత్తుకొని పోవాల్సి వస్తోంది. కాళ్లు చేతుల వాపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  ప్రతిరోజూ తమ బిడ్డ పడుతున్న అవస్థను కళ్లారా చూస్తూ వారు లోలోపలే కుమిలిపోతున్నారు. ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుండటంతో చెన్నైకి పరుగులు పెట్టడం ఆ తల్లిదండ్రులకు పరిపాటిగా మారింది. ఇప్పటికి మూడుసార్లు అలా కోమాలోకి వెళ్లిపోవడంతో చెన్నైకి వెళ్లి చికిత్స చేయించుకొని తీసుకొచ్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ‘త్వరగా ఆపరేషన్‌ చేస్తే తప్పా మా బిడ్డ బతకదని వైద్యులు చెబుతున్నారు, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి’ అని ఆ తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. దాతలు సహకరించి సాయం చేస్తే ఆయేషా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. వివరాలకు 6300163449 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు