ఏపీ కార్ల్‌లో పశువుల వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌

20 Jun, 2020 03:30 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న ఏపీ కార్ల్, కంపెనీ ప్రతినిధులు

దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఐజీవై 

100 మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి 

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం సమీపంలో ఉన్న ఏపీ కార్ల్‌ (ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడావ్న్స్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌ స్టాక్‌)లో పశువులకు సంబంధించిన వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందంపై ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి మధ్య సంతకాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

► రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పశువులకు అవసరమైన వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నందున రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.  
► ఈ నేపథ్యంలో పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదిరింది. తద్వారా 2021 నుంచి పశువులకు అవసరమైన అన్ని రకాల వ్యాక్సిన్ల తయారీ మొదలవుతుంది.  
► గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతు వాపు, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్లు తయారవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంది.  
► ఈ ఒప్పందం ద్వారా ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 100 మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి కలుగనుంది.  
► మన రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఇతర రా>ష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది. ప్రపంచ స్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  

మరిన్ని వార్తలు