మధ్యాహ్న భోజనంలో బల్లి

1 Feb, 2019 09:42 IST|Sakshi
సిబ్బందిని నిలదీస్తున్న ఎంఈఓ, హెచ్‌ఎం

 30 మంది విద్యార్థులకు అస్వస్థత

చాలకూరు ఉన్నత    పాఠశాలలో ఘటన

సోమందేపల్లి:మండలంలోని చాలకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనంలో బల్లి ప్రత్యక్షమైంది. 30 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 1 నుంచి మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తొలగించి నవ ప్రయాస సంస్థ ద్వారా పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాలకు భోజనాన్ని సరఫరా చేయిస్తోంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం సంస్థ సిబ్బంది భోజనాన్ని పాఠశాలకు తీసుకొచ్చారు. దాదాపు 309 మంది విద్యార్థులకు భోజనం వడ్డించడం ప్రారంభించారు. ఈ మేరకు 30 మందికి భోజనం వడ్డించగా వారు భోజనం తినేశారు. ఇంతలో టెన్త్‌ విద్యార్థి అనూ ప్లేట్లోని అన్నంలో బల్లి కనిపించింది.

దీంతో ఆమె ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లింది. హెచ్‌ఎం వహీదాఖానం వెంటనే భోజనాన్ని విద్యార్థులకు అందించకుండా నిలిపివేశారు. అంతుకుమందు భోజనం తిన్న 30 మంది విద్యార్థులు కళ్లు తిరుగుతున్నాయంటూ తెలిపారు. కొంతమంది విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు.పాఠశాల సిబ్బంది సోమందేపల్లి ప్రాథమిక కేంద్రంపు వైద్య సిబ్బందిని పిలిపించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నరేష్‌ తెలపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కాగా అక్కడికి చేరుకున్న నవప్రయాస సంస్థ మూడు మండలాల కిచెన్‌ ఇన్‌చార్జ్‌ వీరేంద్రను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిలదీశారు. దాదాపు 3.30 నిమిషాల వరకు విద్యార్థులకు భోజనం అందకపోవడంతో ఇబ్బంది పడ్డారు. 

తల్లిదండ్రుల ఆందోళన
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దు చేరుకొని తమ పిల్ల ల క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తాజా, మాజీ సర్పంచ్‌ లక్ష్మీనరసప్ప గ్రామ పెద్ద లు షఫీ, అంజినప్ప, త్రినాథ్‌ జగదీష్‌ తదితరులు విద్యార్థుల తల్లి దండ్రులకు మద్ద తు పలికారు. భోజనం నాణ్యతగా లేదని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వారు అధికారులపై మండిపడ్డారు. అనంతరం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందివ్వాలని కోరుతూ ఎంఈఓ ఆంజనేయులునాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు