ఏక్తాశక్తి కాంట్రాక్టు రద్దు చేయాలి

19 Dec, 2019 13:15 IST|Sakshi
ఏకాశక్తి సరఫరా చేసిన పప్పులో బల్లి

పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/దేవరపల్లి: జిల్లాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనాన్ని సరఫరా చేస్తున్న ఏక్తాశక్తి ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.నరహరి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శేషబ్రహ్మం, ఎన్‌.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.  ఏక్తాశక్తి ఏజెన్సీని సరఫరా చేస్తున్న  మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఏ మాత్రం రుచించక విద్యార్థులు భోజనాలు మానేస్తున్నారన్నారు. బుధవారం దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేసిన పప్పులో బల్లి రావడంతో విద్యార్థులు భోజనం మానేసి ఆకలితో అలమటించారన్నారు. ఈ ఏజెన్సీ సరఫరా చేస్తున్న భోజనంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయని ఆరోపించారు.

ఉపాధ్యాయుల నిరసన
ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంలో బల్లి ఉండడాన్ని నిరశిస్తూ దేవరపల్లిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి తహసీల్దార్‌ రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఏక్తా శక్తి ఫౌండేషన్‌ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. విషపూరితమైన భోజనం చేసిన విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఉపాధ్యాయులు అధికారులను ప్రశ్నించారు. భోజనంలో పురగులు, మేకులు, రాళ్లు ఉంటున్నాయని, కుళ్లిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారిని విచారణకు పంపించారని, విచారణ నివేదిక ఏమైయిందో తెలియలేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ఏక్తాశక్తి సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆందోళనలో యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ఉస్సే శంకరుడు, మండల అధ్యక్షుడు ఓరుగంటి శివనాగప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి కె.ఉమాకాంత్, ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు పి.గంగరాజు, యూటీఎఫ్‌ మండల మహిళా అధ్యక్షురాలు ఎంఎస్‌ మహాలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు కె.గంగరాజు, సీహెచ్‌ సత్యవాణి, ఉపాధ్యాయులు కె.భూషణం, మర్ర అబ్బులు, బి.నాగేంద్ర పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు