అయిదేళ్లకే నూరేళ్లు

8 Feb, 2014 00:42 IST|Sakshi
అయిదేళ్లకే నూరేళ్లు

     విద్యార్థి బస్సు దిగుతుండగా ముందుకు పోనిచ్చిన డ్రయివర్
     చక్రాల కింద పడి దుర్మరణం

 
పాఠశాల విడిచి పెట్టిన వేళైంది. చిన్న కొడుకు ఇంకా రాలేదు. గుండెకు హత్తుకోవాలనిపిస్తోంది. ఇంకా రాలేదు. వాడు చెప్పే కబుర్లు వినాలనిపిస్తోంది... ఇంకా రాలేదు. ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసిన ఆ తల్లికి ఇక ఎప్పటికీ రాడని కబురు వచ్చింది. అయిదేళ్ల బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయన్న దుర్వార్త వచ్చింది. గుండెల్ని బద్దలు చేసింది. పాఠశాల మినీ బస్సు చక్రాల కింద చిన్నారి నలిగిపోయాడు. డ్రయివర్ నిర్లక్ష్యానికి అనంత లోకాలకు సాగిపోయాడు.
 
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: పాఠశాల మినీ బస్సును డ్రయివర్ నిర్లక్ష్యంగా నడపడంతో ఎల్‌కేజీ చదువుతున్న బాలుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి-సబ్బవరం రహదారిలోని పాత రేబాక కూడలి వద్ద శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసుల కథనమిది. పాత రేబాకకు చెందిన కంపర మహేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. మహేష్ వ్యాన్ డ్రయివర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీ వైష్ణవి స్కూలో పెద్ద కొడుకు మంజీత్ (8)ను ఒకటో తరగతిలో, చిన్న కొడుకు నిహాంత్ (5)ను ఎల్‌కేజీలో చేర్పించా డు.

రోజూలాగే తరగతులు అయిపోయాక పాఠశాల బస్సులో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. రేబాకలోని నిహాంత్ ఇంటికి సమీపంలో డ్రయివర్ బస్సును ఆపాడు. క్లీనర్ లేకపోవడంతో పిల్లలందరూ దిగారనుకున్న డ్రయివర్ నిహాంత్‌ను గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో దిగుతున్న నిహాంత్ బస్సు కదలడంతో కింద పడిపోయాడు.

అది గమనించని డ్రయివర్ బస్సును నడపడంతో చక్రాల కింద పడిన బాలుని తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. తోటి విద్యార్ధులు, సమీపంలోని కోడిగుడ్ల వ్యాన్ డ్రయివర్ గమనించి గ్రామస్తులకు తెలిపారు. సమాచారం అందుకున్న తల్లి లక్ష్మి రోదిస్తూ కొడుకు మృతదేహం వద్దకు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పాఠశాల వ్యాన్ డ్రయివర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ కోటేశ్వరరావు విలేకరులకు తెలిపారు.
 

మరిన్ని వార్తలు