పడగవిప్పుతున్న ‘కాల్‌’నాగులు

7 Jun, 2018 13:00 IST|Sakshi

జిల్లాలో పెరుగుతున్న అనధికార వడ్డీ వ్యాపారస్తులు

అవసరాలను బట్టి వడ్డీ రేట్లకు రెక్కలు

అధికారపార్టీ అండదండలతో రెచ్చిపోతున్న వ్యాపారులు

ఇదేమిటని ప్రశ్నిస్తే దుర్భాషలాడుతూ బెదిరింపులు

గుజ్జనగుండ్లకు చెందిన షేక్‌ మహబూబీ కొడుకుతో కలసి బిర్యానీ పాయింట్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. వ్యాపార అవసరాల కోసం అదే ప్రాంతానికి చెందిన షేక్‌ కమ్రూన్, రఫీ, బాబుల నుంచి రూ. లక్షను మూడు నెలల కిందట వడ్డీ కింద అప్పుగా తీసుకుంది.  తీసుకున్న రోజు నుంచి రోజుకు రూ. రెండు వేల చొప్పున కట్టుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు తీసుకున్న బాకీ కంటే రూ. 80 వేలు అదనంగా కట్టింది. బాకీ తీరిపోయిందని అనుకుంటున్న తరుణంలో రుణదాతలు వచ్చి ఇప్పటి వరకు కట్టింది వడ్డీ మాత్రమేనని.. అసలు రూ. లక్షతో కలిపి మరికొంత వడ్డీ చెల్లించాలని వేధిస్తున్నారు. డబ్బు కట్టని పక్షంలో బిర్యానీ పాయింట్‌ మూసి వేస్తామని బెదిరిస్తున్నారు. ఈ అధిక వడ్డీ వ్యాపారస్తుల వేధింపుల నుంచి రక్షించాలంటూ ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.

సాక్షి, గుంటూరు: రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు కాల సర్పాలుగా మారి బుసలు కొడుతున్నారు. అవసరాలను ఆసరా చేసుకొని వడ్డీ మీద వడ్డీ వేస్తూ అమాయకుల శ్రమను జలగల్లా పీడిస్తున్నారు. కాదంటే వారిపై కాటేసేందుకు కూడా వెనకాడటం లేదు. కూతురి పెళ్లి.. పిల్లల చదువులుల.. కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు.. ఇలా పేదవాడి అవసరాలు, చిరు వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. మీటర్‌ వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ... ఇలా పేరు ఏదైనా నిలువు దోపిడీ మాత్రం సర్వసాధారణంగా మారింది. అప్పుకోసం తమ వద్దకు వచ్చే వారి వద్ద వడ్డీ వ్యాపారస్తులు ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు, ప్రాంసరీ నోట్ల మీద సంతకాలు చేయించుకుని ఇస్తున్నారు.  వందకు రూ. 10 నుంచి 20 వడ్డీని ముందుగానే తమ వద్ద ఉంచుకుని మిగిలిన డబ్బును అప్పుగా ఇస్తున్నారు. రుణగ్రహిత వడ్డీ చెల్లించడం ఆలస్యం అయినా, అక్రమంగా వసూలు చేస్తున్న వడ్డీ గురించి ప్రశ్నించినా కోర్టులో కేసు వేసి బెదిరిస్తున్నారు.

రెండు నెలల వ్యవధిలో ముగ్గురు ఆత్మహత్య
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌ మనీ వ్యవహారంలో ప్రభుత్వం కంటి తుడుపుగా నామమాత్రపు కేసుల నమోదు చేసి చేతులుదులుపుకోవడంతో మళ్లి కాల నాగులు విషం కక్కడం మొదలు పెట్టాయి. నరసరావు పేటలో గత ఏడాది ‘కాల్‌ నాగుల’ వేధింపులు తట్టుకోలేక రెండు నెలల వ్యవధిలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరిచంలేక ఆత్మహత్యలు చేసుకుని తమవారిని రోడ్లపాలు చేసిన వారు కొందరు ఉంటే, మరి కొన్ని కుటుంబాలు ఊర్లు వదిలి వెళ్లిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి.

అధికార పార్టీ నేతల అండ
అధికార పార్టీకి చెందిన కొందరు వడ్డీ వ్యాపారులు నేరుగా పోలీస్‌ స్టేషన్లలో వైట్‌ కాలర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులతోనే పంచాయితీలు చేయిస్తూ వారికి రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటూ దర్జాగా తిరుగుతున్నారు. గుంటూరులోని ఫ్రూట్‌ మార్కెట్లో ఇప్పటికీ రోజు వారీ వడ్డీలు బహిరంగంగానే కొనసాగుతుండటం మీటరు వడ్డీ వ్యాపారుల దందాకు నిదర్శనం. తెనాలిలోని కూర గాయల మార్కెట్‌లో స్థానిక ప్రజాప్రతినిధి అండతో ఆయనకి నెలవారీ మామూళ్లు ఇచ్చుకుంటూ మీటరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. నరసరావుపేట కూరగాయల మార్కెట్‌లో అధికార పార్టీ అండదండలతో వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. అడ్డగోలు వడ్డీలను కట్టలేక, వారి వేధింపులు భరించలేక కొంతమంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది.   కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. వడ్డీ వ్యాపారం చేసే వారు లైసెన్సు పొందకుండా వడ్డీలకు ఇస్తూ రుణగ్రహితలను వేధింపులకు గురిచేస్తున్నా అధికారులు మాత్రం వారిని పట్టించుకోవడం లేదు.

ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్‌  
వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై పీడీయాక్టు కేసు నమోదు చేస్తాం. చట్టం పరిధిలో అందరూ సమానమే.  వడ్డీల పేరుతో సామాన్యులను పీక్కుతింటున్న రాబందులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.– సీహెచ్‌. వెంకటప్పలనాయుడు, రూరల్‌ ఎస్పీ

పోలీసులను ఆశ్రయించాలి
వడ్డీ వ్యాపారస్తులు వేధింపులకు  పాల్పడితే బాధితులు స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాలి. వేధింపులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడటం, ఊర్లు వదిలి వెళ్లిపోవడం వంటి పనులు చెయ్యవద్దు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబంపై ప్రభావం చూపుతాయి. అర్బన్‌ జిల్లా పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారస్తుల వివరాలు ఆరా తీస్తున్నాం. – సీహెచ్‌ విజయారావు, అర్బన్‌ ఎస్పీ

మరిన్ని వార్తలు