స్థానిక ఎమ్మెల్సీలకు జూన్‌లో ఎన్నికలు

20 May, 2015 23:57 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ నెలలో కమిషన్ ఎన్నికలు నిర్వహించనుందని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.

బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రెండు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు చెందిన ఓటర్ల జాబితాను రెండు రోజుల క్రితమే ప్రకటించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాను వెబ్ సైట్‌లో కూడా ఉంచామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే ఓటు వేసే అవకాశం ఉండదని, ఈ నేపథ్యంలో జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని, పేరు లేకపోతే ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్లకు సూచించారు.

స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్లగా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులుంటారని, అలాగే ఎక్స్ ఆఫీషియో సభ్యులగా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన వివరించారు. ఈ నెల 25వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను వచ్చే నెల 6వ తేదీన ప్రకటిస్తామని, ఇదే జాబితాను రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు