రాజ్యాంగం అపహాస్యం

16 Mar, 2020 04:04 IST|Sakshi

కరోనా వైరస్‌ను సాకుగా చూపుతూ స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషనర్‌ ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఓ వైపు ఎన్నికలను వాయిదా వేస్తూనే పలువురు అధికారులను
బదిలీ చేశారు. నిరు పేదలకు ఇళ్లపట్టాలిచ్చే కార్యక్రమాన్ని ముందే ఆపేశారు. ఇది ఆరువారాలతో ఆగుతుందా.. ఇంకా సంతృప్తి చెందలేదనే కారణంతో ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఈసీ అధికారాన్ని చెలాయించే అవకాశం ఉందని విమర్శకులంటున్నారు..ఆరువారాలే కాక ఎన్నిరోజులైనా దానిని కొనసాగించే ప్రమాదం ఉందని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండా ఎవరో చెప్పింది చేస్తున్నట్లు.. ఎవరో రాసిచ్చింది చదువుతున్నట్లు... ఎన్నికల కమిషనర్‌ వ్యవహరించడం రాజ్యాంగాన్ని అపహాస్యం పాల్జేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈసీ మాట.. వైరస్‌ 
కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఆరువారాల పాటు నిలిపివేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. ఆరువారాల తర్వాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తదనంతరం ఎన్నికల ప్రక్రియ పునః ప్రారంభమౌతుందని ఆయన తెలిపారు. అత్యున్నత స్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి పరిస్థితులను మదింపుచేసి ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అప్పటి వరకు ఎన్నికల కోడ్‌ కొనసాగుతుందని ఆయన అన్నారు.

సీఎం ధర్మాగ్రహం 
కరోనా వైరస్‌ను సాకుగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేయడం ధర్మమేనా? అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ నిష్పాక్షికతతో పాటు విచక్షణ కూడా కోల్పోయారని విలేకరుల సమావేశంలో విమర్శించారు. ‘‘ఎన్నికలు పూర్తయి స్థానిక సంస్థల ప్రతినిధులంతా బాధ్యతలు చేపడితే కరోనా వంటి వైరస్‌లను తరిమికొట్టడం మరింత సులువవుతుంది.. ప్రజారంజక పాలనతో అధికార పార్టీ మంచి విజయాలను సాధిస్తున్నందునే వ్యవస్థలను నీరుగార్చి చంద్రబాబు ఎన్నికలను అడ్డుకుంటున్నారు.. ఈసీ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. నిర్ణయాన్ని పునః సమీక్షించుకోకపోతే ఈ అంశాన్ని ఇంకా పైకి తీసుకువెళతాం’’అని పేర్కొన్నారు.

ఈసీ.. మారిన వాయిస్‌ 
ఎన్నికల వాయిదాపై గవర్నర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫిర్యాదుచేయడం, విలేకరుల సమావేశం పెట్టి అనేక ప్రశ్నలు సంధించడంతో సాయంత్రం కల్లా ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ మాట మార్చారు. కరోనా వైరస్‌ సాకుగా చూపడం సరే.. ఆ విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితోగానీ, సీఎస్‌తో గానీ సంప్రదించారా.. పాటించాల్సిన ప్రొసీజర్స్‌ ఏమైనా పాటించారా అని ముఖ్యమంత్రి అడిగేసరికి.. సాయంత్రానికి ఒక నోట్‌ రిలీజ్‌ చేశారు.. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడినట్లు అందులో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ అనేది ఓ సాకు మాత్రమేనని దీనిని బట్టి అర్ధమౌతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

‘సుప్రీం’ వైపు సర్కార్‌
తొమ్మిది నెలల సంక్షేమ పాలన చూసి ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాల సంఖ్య చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుందని వైఎస్సార్‌సీపీ నాయకులంటున్నారు. ఇది చూసి ఓర్వలేకే తమ సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను ఉపయోగించుకుని ఎన్నికలు వాయిదా వేయించారని వారు పేర్కొంటున్నారు. ఈసీ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించిందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు