పేదల భూములపై  పెద్దల కన్ను..!

13 Aug, 2019 10:11 IST|Sakshi

లింగాలవలసలో తెరపైకి వచ్చిన కబ్జాయత్నాలు

రూ.3 కోట్ల విలువైన 29 ఎకరాలను కాజేసే ప్రయత్నం

ఏడు నెలల కిందటే హెచ్చరించిన అధికారులు

అప్పట్లో భూములు రక్షించిన స్థానిక ప్రజాప్రతినిధి

తన్నుకుపోవాలని విశాఖ మహిళ తాజా ప్రయత్నం

బ్రోకర్లుగా మారిన కొందరు స్థానిక వ్యక్తులు 

అవి పేద గిరిజనులకు ప్రభుత్వం ఫలసాయం కోసం ఇచ్చిన ఢీ పట్టా భూములు.  క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా నేరం. ఆ భూములను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోవాలని స్కెచ్‌ వేశారు. కబ్జా చేసేందుకు ఏడునెలల కిందట పావులు కదిపారు. దీనిని పసిగట్టిన స్థానిక ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూములను రక్షించారు. మళ్లీ అవే భూములను సొంతం చేసుకునేందుకు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానికులకు సొమ్ములు ఎరవేసి, అధికారుల కళ్లుగప్పే ప్రయత్నాలు చేస్తున్న అంశం మెంటాడ మండలంలోని కొండలింగాలవలసలో అలజడి రేపుతోంది. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మెంటాడ మండలంలోని కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో రెడ్డివానివలస–కొండమామిడివలస మధ్యన సర్వే నంబర్‌ 269లో 25.14 ఎకరాలు , 267/3లో 3.72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కాజేసుం దుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగారు. అయితే, ఈ భూమిని గతంలో సమీప గ్రామాల గిరిజనులు సాగు చేసుకుని జీవించేందుకు ప్రభుత్వం ఢీ పట్టాలు మంజూరు చేసింది. సుమారు పదిమంది రైతులు ఆ భూమిని సాగుచేసేవారు. వారిలో ఇబ్బరు మినహా మిగిలినవారు చనిపోయారు. వారి వారుసులెవరూ ఆ భూములను సాగుచేయడంలేదు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య రేటు పలుకుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన విశాఖకు చెందిన ఓ మహిళ రంగంలోకి దిగారు. ఆ ఇద్దరి నుంచి  భూమిని కొనుగోలు చేయడంతో పాటు మిగిలిన భూమినంతటినీ దక్కించుకోవాలని పథకం వేశారు.

ఈ ఏడాది జనవరిలో ఆ భూమిలో బోర్లు కూడా వేసి, చుట్టూ ఇనుప కంచె వేయడానికి సన్నాహాలు చేశారు.  ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు విశాఖ మహిళ దుశ్చర్యలను స్థానిక గిరిజనులతో కలిసి అడ్డుకున్నారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. భూములు తమవిగా చెబుతున్న వారు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉంటే తీసుకొని రావాలని అప్పటి తహసీల్దార్‌ రొంగలి ఎర్రినాయుడు వారికి నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు మొత్తం భూమిని సర్వే చేశారు. 269,67/3 సర్వేనెంబర్లలో గల భూమిని ప్రభుత్వం భూమిగా గుర్తించారు. ఎవరూ ఆ భూముల జోలికి వెళ్లరాదని, నిబంధనలు అతిక్రమించి భూముల్లో ప్రవేశిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అప్పటి తహసీల్దార్‌ రొంగలి ఎర్రినాయుడు ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. భూమిని చదును చేసిన జేసీబీని కూడా స్వాధీనం చేసుకొని ఆండ్ర పోలీసులకు అప్పగించించారు.
మళ్లీ కథ మొదలు.. 
ఏడు నెలల పాటు ఈ భూముల గురించి పట్టించుకోని విశాఖ మహిళ మరలా తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకున్నారు. ఇదే సమయంలో తహసీల్దార్‌ ఎర్రినాయుడికి బదిలీకావడంతో ఆయన స్థానంలో కొత్త తహసీల్దార్‌గా నెల్లూరి మంగరాజు గత నెల 24న వచ్చారు. ఆయనకు విషయం తెలిసి, అర్ధమయ్యేలోగా భూములు పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. దీనికోసం కొందరు స్థానిక వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారు. వారికి కొంత సొమ్ము కూడా ఆ మహిళ ముట్టజెప్పారు. అయితే, ఆ సొమ్ములు పంచుకోవడంలో ఆ వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల కొత్త వివాదం మొదలైంది. డబ్బుల కోసం ఆ మహిళను వారిలో కొందరు వేధించడం ప్రారంభించారు. చివరికి పోలీస్‌ స్టేషన్‌ వరకు వారి పంచాయితీ చేరింది. ఈ నేపధ్యంలో కొత్త తహసీల్దార్‌కు ఈ వివాదం గురించి తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ భూములపై మరోసారి సర్వేయర్‌తో సర్వే చేయించడానికి సిద్ధమవుతున్నారు.

చూస్తూ ఊరుకోం.. 
ప్రభుత్వ భూములను కాపాడడం తహసీల్దార్‌గా నా బాధ్యత. కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో కొన్ని భూములకు సంబంధించి వివాదాలున్నట్టు నా దృష్టికి వచ్చింది. గత తహసీల్దార్‌ వాటిని సర్వే చేయించి ప్రభుత్వ భూములుగా గుర్తించి బోర్డులు పెట్టించారని తెలిసింది. నేను కొత్తగా వచ్చినందున కొంత అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా రెండు రోజుల్లో భూములను సర్వే చేయిస్తాం. రికార్డులు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ భూములు తన్నుకుపోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోం.
– నెల్లూరి మంగరాజు, తహసీల్దార్, కొండలింగాలవలస  

మరిన్ని వార్తలు